హరిహర వీరమల్లు.. ఓ క్లారిటీ వచ్చేసింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో చేస్తోన్న పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా రెండేళ్ళ క్రితం మొదలైంది. అయితే మూవీ స్టార్ట్ అయిన తర్వాత చాలా రకాల అడ్డంకులు వచ్చాయి. వాటిని దాటుకొని క్రిష్ మెల్లగా మూవీని కంప్లీట్ చేయడంపై ఫోకస్ చేశారు. ఈ 2022లోనే మూవీ ఫినిష్ చేసేద్దామని అనుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయడం కష్టం కావడంతో అలా వాయిదా పడుతూ, అప్పుడప్పుడు షూటింగ్ జరుపుకుంటూ వచ్చింది.

ఈ ఏడాదిలో చిత్రాన్ని రిలీజ్ చేయాలని డేట్ కూడా క్రిష్ ఫిక్స్ చేశారు. అయితే మూవీ 35 నుంచి 40 రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. ఇది కంప్లీట్ అయితే కాని మొత్తం అవుట్ పుట్ సిద్ధం కాదు. అయితే పవన్ కళ్యాణ్ బ్రో, ఓజీ సినిమాలపై ఫోకస్ చేయడంతో హరిహర వీరమల్లు కోసం టైమ్ కేటాయించలేకపోయారు. దీంతో మళ్ళీ సినిమాపై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఇదే సమయంలో నిర్మాత ఏఎం రత్నం ఫైనాన్సియల్ ప్రాబ్లమ్స్ కారణంగానే మూవీ వాయిదా పడిందనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ సినిమా పూర్తి కావాలంటే మరో 25 కోట్ల వరకు అవసరం అవుతుందని, దానిని అడ్జస్ట్ చేయలేకపోవడంతో సినిమా షూటింగ్ ఆగిపోయిందనే గాసిప్స్ సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా ఏఎం రత్నం ఓ మీడియా ఛానల్ లో ఈ సినిమాపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు.

హరిహర వీరమల్లు షూటింగ్ వాయిదా పడిన మాట వాస్తవమేనని, అయితే ఏవో ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆగిందనేది అవాస్తవం అని తేల్చేశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రజాక్షేత్రంలో రాజకీయాలలో బిజీగా ఉన్నారని, ఆయన ప్రయాణం నేపథ్యంలోనే షూటింగ్ వాయిదా వేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇప్పటి వరకు చేయనటువంటి పాత్ర చేస్తున్నారు.

అలాగే పాన్ ఇండియా లెవల్ లోతెరకెక్కుతోంది. మూవీ లేట్ అయిన పర్లేదు పర్ఫెక్షన్ ఉండాలని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఎన్నికలు ఏప్రిల్ లో జరిగితే ఎలక్షన్స్ కి ముందే మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని అన్నారు. ఒకవేళ ముందస్తు ఎన్నికలు ఉంటే మాత్రం అవి పూర్తయిన తర్వాత షూటింగ్ కంప్లీట్ చేస్తారని చెప్పారు. వచ్చే ఏడాది సినిమా కచ్చితంగా రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు.