సంక్రాంతి సినిమాల సందడి…హనుమాన్‌ అతిపెద్ద విజయం!

సంక్రాంతి సీజన్‌ వస్తుందంటే సినిమాల సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్‌ హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకూ సినిమాలను రిలీజ్‌ చేయడానికి అదే సరైన సమయం అని చాలామంది దర్శక నిర్మాతలు నమ్ముతారు. అందుకే ముందుగానే తేదీలనూ ప్రకటిస్తుంటారు. ప్రతిసారిలానే ఈసారీ బాక్సాఫీస్‌ వద్ద భారీ పోటీ నెలకొంది. తెలుగులో అగ్ర తారలైన నాగార్జున,వెంకటేశ్‌,మహేశ్‌ బాబుతో పాటు చిన్న హీరో సజ్జూ తేజ నటించిన సినిమాలు ప్రేక్షకులను అలరించాయి.

నాసామి రంగా, సైంధవ్‌,గుంటూరు కారంతో పాటు, మనుమాన్‌ చిత్రాలు సంక్రాంతిబరిలో నిలిచాయి. మొత్తంగా సంక్రాంతి సినిమాలు బాగానే డబ్బు చేసుకున్నాయి. సంక్రాంతి పండగ సందర్భంగా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ ’గుంటూరు కారం’ జనవరి 12న విడుదలైతే, అదే రోజు చిన్న సినిమా ’హనుమాన్‌’ కూడా విడుదలైంది. ఈ సినిమాకి ప్రశాంత్‌ వర్మ దర్శకుడు, తేజ సజ్జ కథానాయకుడు.

తరువాత జనవరి 13న సీనియర్‌ నటుడు వెంకటేష్‌ నటించిన ’సైంధవ్‌’ విడుదలయింది, దీనికి శైలేష్‌ కొలను దర్శకుడు. జనవరి 14న నాగార్జున, అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌ నటించిన ’నా సామిరంగ’ విడుదలైంది. విజయ్‌ బిన్ని మొదటిసారిగా దర్శకత్వం వహించిన సినిమా ఇది, ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. సినిమా కూడా సంక్రాంతి పండగలో భాగం, అందుకే చిత్ర పరిశ్రమలో కూడా సంక్రాంతి పండగ సెలవులని వ్యాపారానికి అనుగుణంగా మలుచు కోవడానికి నిర్మాతలు ఈ పండగకి సినిమాలు విడుదల చేస్తారు.

మామూలుగా అయితే రెండు సినిమాలు ఒకేరోజు విడుదలవుతాయి, కానీ ఇలాంటి పండగలప్పుడు నాలుగు సినిమాలు విడుదలైనా, ప్రేక్షకులు చూస్తారని నిర్మాతల భరోసా. అందుకే ఇలా నాలుగు సినిమాలు వేటికవే వైవిధ్యంగా వున్నవి ప్రేక్షకులని అలరిస్తాయని అనుకున్నారు. మొదటి రోజు రెండు సినిమాలు విడుదలయ్యాయి. ప్రశాంత్‌ వర్మ కొంతవరకు గ్రాఫిక్స్‌ వుపయోగించి తెలుగులో సూపర్‌ హీరో చిత్రాన్ని ఈ ’హనుమాన్‌’ సినిమాతో ప్రేక్షకులకి పరిచయం చేసాడు. ఇందులో తేజ సజ్జ సూపర్‌ హీరో గా నటించాడు.

ఈ సినిమాకి మొదటి రోజు థియేటర్స్‌ కొందరు ఇవ్వలేదు, అందుకని ఈ సినిమా ప్రీమియర్‌ ఆటలు ఎక్కువ వేసుకున్నారు. సంక్రాంతి సినిమాలల్లో ముందు విడుదలైంది ఈ ’హనుమాన్‌’ సినిమానే. అయితే అనూహ్యంగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, అనుకున్నదానికంటే చాలా పెద్ద విజయం సాధించింది ’హనుమాన్‌’ సినిమా. ప్రేక్షకులు ముఖ్యంగా పిల్లలు ఈ సినిమాని చూడటానికి ఎగబడ్డారు అనే చెప్పాలి.

ఒక్క తెలుగు రాష్టాల్లోన్రే కాదు, ఈ సినిమా, అటు హిందీ మాట్లాడే ప్రాంతాలలోనూ, అటు విదేశీ మార్కెట్‌ లోనూ సంచలనాలు సృష్టిస్తోంది. ఐదో రోజు కూడా ఈ సినిమాకి చాలా పెద్ద డిమాండ్‌ వుంది, అంటే ఈ సినిమా ఎంత విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ’హనుమాన్‌’ ఇంత పెద్ద విజయాన్ని సాధిస్తాడని ఊహించలేదు.