గుంటూరు కారం : మహేష్‌ మాస్‌ అవతారం!

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌ కోసం ఎదురు చూస్తున్న మహేష్‌ అభిమానులకు 14 ఏళ్ల తరువాత ’గుంటూరు కారం’ సినిమా రూపంలో అవకాశం వచ్చింది. వాళ్ళిద్దరి కలయికలో వచ్చిన మూడో సినిమా ఇది, ఇందులో శ్రీలీల, విూనాక్షి చౌదరి కథానాయికలు. ప్రకాష్‌ రాజ్‌, మురళి శర్మ, రావు రమేష్‌, రాహుల్‌ రవీంద్రన్‌ ఇతర తారాగణం. సంక్రాంతి పండగ సందర్భంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ పండగకి విడుదలైన చిత్రాల్లో అత్యధిక బడ్జెట్‌ పెట్టిన సినిమా ఇదే. సినిమాపై ముందునుంచే భారీ అంచనాలు ఉండడంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి కనిపించింది.

వెంకటస్వామి (ప్రకాష్‌ రాజ్‌) ఒక రాజకీయనాకుడు, అతని కుమార్తె వసుంధర (రమ్యకృష్ణ) కూడా రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంది. వసుంధరకి మొదట సత్యం (జయరాం) తో వివాహం అవుతుంది వాళ్ళకి పుట్టిన కుమారుడు రమణ (మహేష్‌ బాబు). కానీ వూర్లో గొడవలు రావటం అందులో ఆమె భర్త ఉండటంతో, భర్తని, కొడుకుని గుంటూరులో వదిలేసి హైదరాబాదులో వున్న తన తండ్రి దగ్గరికి వచ్చేస్తుంది వసుంధర. అక్కడే రెండో సారి నారాయణని (రావు రమేష్‌) పెళ్లిచేసుకుంటుంది. వాళ్ళకి రాజగోపాల్‌ (రాహుల్‌ రవీంద్రన్‌) అనే కుమారుడు ఉంటాడు.

వెంకటస్వామి తన నిజమైన వారసుడు రాజగోపాల్‌ అని చెప్పుకుంటూ అతన్ని కూడా ఎన్నికల్లో పోటీ చేయించడానికి సమాయత్తం అవుతూ ఉంటాడు. అయితే మొదటి వారసుడు రమణని హైదరాబాదు పిలిపించుకొని తనకి ఆస్తి అవసరం లేదు అని, వసుంధరకి తనకి సంబధం లేదని దస్తావేజు కాయితాల మీద సంతకం పెట్టమని చెపుతూ ఉంటాడు. వెంకటస్వామి వకీలు పాణి (మురళి శర్మ) రమణతో ఎలా అయినా సంతకం పెట్టిస్తాను అని చెప్పి తన కూతురు అమ్ములు (శ్రీలీల)ని గుంటూరు పంపిస్తాడు. అమ్ములు, బాలు (వెన్నెల కిషోర్‌) తో గుంటూరు వెళుతుంది, కానీ ఆమె రమణతో ప్రేమలో పడుతుంది. ఇంతకీ రమణ సంతకం పెట్టాడా? రమణకి, తల్లి వసుంధర అంటే ఎందుకు కోపం? వెంకటస్వామి తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎటువంటి రాజకీయ ఎత్తులు వేసాడు? చివరికి ఏమైంది అనే విషయాల కలబోతే’గుంటూరు కారం’ సినిమా.

దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కి మాటల మాంత్రికుడు అని పేరుంది. అందుకని అయన సినిమాలలో చిన్న చిన్న సరదా మాటలు రాస్తూ ప్రేక్షకులని కట్టి పడేస్తూ వుంటారు. అలాగే అతని మాటల్లో, చిన్న వెటకారం, చిలిపితనం, ప్రాస ఇవన్నీ ఉంటాయి, అందుకే అతని మాటలని ప్రేక్షకులు బాగా ఆనందిస్తూ వుంటారు. ఈ ’గుంటూరు కారం’ సినిమాలో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, కేవలం మహేష్‌ బాబుని అతని అభిమానులకు ఎలా కావాలో అలా చూపించాలని అనుకున్నాడు. అందుకే మహేష్‌ ని దృష్టిలో పెట్టుకొని మాటలు రాసాడు.

తల్లి సెంటిమెంట్‌ నేపధ్యంగా ఎంచుకొని మహేష్‌ ని ఒక మాస్‌ అవతారంలో చూపించారు. సరదాగా సాగుతూ, మధ్యలో మహేష్‌ బాబు తో డాన్సులు, పోరాట సన్నివేశాలు చేయిస్తూ మొదటి సగం పూర్తి చేయిస్తాడు. ఇక రెండో సగంలో కథ గురించి ఒక్కొక్కటీ విప్పుకుంటూ వెళతాడు. జయరాం, మహేష్‌ బాబు తండ్రీ కొడుకులు, ఎందుకు గుంటూరులో వున్నారు, మహేష్‌ బాబు, తల్లి రమ్యకృష్ణను కలుద్దాం అని వస్తే ఆమె ఎప్పుడూ అతన్ని కలవదు. ఒకరంటే ఒకరికి పడనట్టు వున్నా, వాళ్ళిద్దరి మధ్య వుండే ఆ తల్లి కొడుకుల అనుబంధాన్ని, వాళ్ళ మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలని బాగా చూపించగలిగాడుత్రివిక్రమ్‌.

రమ్యకృష్ణ మీద దాడులు జరుగుతాయి, అందరూ అది వేరేవాళ్లు చేయించారు అని అనుకుంటారు, చివరికి అది ఎవరు చేయించారు అనేది తెలిసాక అందరికీ ఒక షాక్‌ లా ఉంటుంది. ఈ సినిమాలో మహేష్‌ లో ఒక కొత్త అవతారం చూస్తారు. అతని డాన్సులు, డైలాగ్‌ డెలివరీ, గుంటూరు యాస, శ్రీలీలని టీజ్‌ చేసే విధానం, ఇలా అన్నీ కొత్తగా ఉంటాయి. అభిమానులను దృష్టిలో పెట్టుకొని చేసినవి ఇవన్నీ. స్క్రీన్‌ మీద పాటలన్నీ బాగుంటాయి. మహేష్‌ బాబు సినిమాలో ఈమధ్యకాలంలో మొదటిసారి డాన్సులు బాగా చేసాడు.

సినిమా అంతా మహేష్‌ తన భుజాల మీద వేసుకున్నాడు. కామెడీ, భావోద్వేగాలు, డాన్సులు, పోరాట సన్నివేశాలు, ఒకటేంటి అన్నీ చాలా బాగా చేసి అంతా తానే అయ్యి సినిమాలో కనిపిస్తాడు. శ్రీలీల డాన్సులు అదరగొట్టింది. విూనాక్షి చౌదరి అతిధి పాత్రలో ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రకాష్‌ రాజ్‌ కి చాలా కాలం తరువాత మళ్ళీ ఒక మంచి పాత్ర వచ్చింది, అతనికి ఇలాంటివి కొట్టిన పిండి, అందుకని చేసుకుపోయాడు. రమ్య కృష్ణ మహేష్‌ బాబు తల్లిగా చాలా బాగా చేసింది. వెన్నెల కిశోర్‌ ఈ సినిమాలో చాలా సేపు కనపడతాడు, అలాగే నవ్విస్తాడు కూడా. రావు రమేష్‌ అక్కడక్కడా కనపడినా, క్లైమాక్స్‌ లో మాత్రం ఒక్కసారిగా మెరుస్తాడు. బ్రహ్మాజీ పోలీసు ఇనస్పెక్టర్‌ గా బాగా చేశారు. ఈశ్వరి రావుకి ఈ సినిమాలో మంచి పాత్ర లభించింది, ఆమె హుందాగా నటించి మెప్పించింది. అజయ్‌, అజయ్‌ ఘోష్‌, రాహుల్‌ రవీంద్రన్‌ ఇంకా మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.