శ్రీనువైట్ల – గోపీచంద్‌ సినిమాకు నిర్మాతల కష్టాలు!

చాలా కాలం తరువాత దర్శకుడు శ్రీను వైట్ల మళ్ళీ ఒక సినిమా మొదలెట్టారు. ఈసారి గోపీచంద్‌ తో ప్లాన్‌ చేశారు, వేణు దోనేపూడి అనే నిర్మాత చిత్రాలయం బ్యానర్‌ విూద ఈ సినిమాని గత సంవత్సరం సెప్టెంబర్‌ లో మొదలెట్టారు. షూటింగ్‌ కూడా కొంత అయింది.

అయితే ఈ సినిమా షూటింగ్‌ మొదలెట్టిన కొన్ని రోజులకే నిర్మాత వేణు దోనేపూడి చేతులెత్తేసినట్టు పరిశ్రమలో ఒక టాక్‌ నడిచింది. అతనికి తెలిసిన ఇంకో నిర్మాత దగ్గర కొంత డబ్బులు తీసుకొని మరికొన్ని రోజులు షూటింగ్‌ చేసినట్టుగా సమాచారం. అయితే ఆమధ్య ‘భీమా’ ప్రచారాలకు వచ్చిన గోపీచంద్‌ ని తను చేస్తున్న శ్రీను వైట్ల సినిమా గురించి, ఆ సినిమా నిర్మాతలు మారుతున్నారా అన్న ప్రశ్న అడిగితే తనకు తెలియదని దాటవేసారు. ‘నేను శ్రీను వైట్లతో మాట్లాడి చాలా రోజులు అయింది, ఈ ‘భీమా’ సినిమా ప్రచారాల్లో వున్నాను’ అని తప్పుకున్నారు గోపీచంద్‌.

అయితే అప్పటికే ఆ సినిమా నిర్మాత వేణు దోనేపూడి తన దగ్గర డబ్బులు లేవని, ఈ ప్రాజెక్ట్‌ కి ఇంక తాను పెట్టలేను అని చెప్పేసారు అని పరిశ్రమలో టాక్‌ నడిచింది. అయితే ఈ ప్రాజెక్ట్‌ ని ‘మజిలీ’ సినిమా నిర్మాతలు సాహు, హరీష్‌ పెద్ది తీసుకుంటారని ఆమధ్య ఒక ప్రచారం కూడా పరిశ్రమలో నడిచింది. ఎందుకంటే ఆ నిర్మాతలు వేణు కి బాగా తెలిసినవారు అని, వాళ్ళ దగ్గర కూడా కొంత డబ్బు తీసుకున్నారు అని ఒక టాక్‌ నడిచింది.

కానీ ఇప్పుడు అనూహ్యంగా పీపుల్‌ విూడియా ఫ్యాక్టరీ సంస్థ పేరు వచ్చింది. పీపుల్‌ విూడియా ఫ్యాక్టరీతో కలిపి వేణు దోనేపూడి ఈ సినిమాని నిర్మించనున్నారని ఒక అధికార ప్రకటన వచ్చింది. అంటే ఈ సినిమా తిరిగి తిరిగి మళ్ళీ పీపుల్‌ విూడియా వాళ్ళ దగ్గరకి వచ్చిందని అనుకుంటున్నారు. అయితే మరి ‘మజిలీ’ నిర్మాతలు ఎందుకు తప్పుకున్నారో తెలియదు కానీ, ఈ ఆగిపోయిన సినిమాని నిర్మాత టి. జి విశ్వప్రసాద్‌ తీసుకోవటం ఆసక్తికరం. చాలా కాలం తరువాత మళ్ళీ మంచి విజయంతో రావాలన్న దర్శకుడు శ్రీను వైట్ల సినిమాకి ఇలా కష్టాలు మొదట్లోనే ఆరంభం అయ్యాయి. అయితే ఇప్పుడు పెద్ద సంస్థ అయిన టి. జి విశ్వప్రసాద్‌ తీసుకున్నారు కాబట్టి ఈ సినిమా విజయవంతంగా షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదల అవుతుంది అనే నమ్మకం దర్శకుడికి, నటుడు గోపీచంద్‌ కి ఇప్పుడు వచ్చి ఉంటుంది అని అంటున్నారు.