Google Desktop Mode: ఫోన్‌నే కంప్యూటర్‌లా మార్చే ఫీచర్.. గూగుల్ డెస్క్‌టాప్ మోడ్ వచ్చేస్తోంది!

ఇప్పుడు ఫోన్‌దే కాలం. కానీ త్వరలో అదే ఫోన్‌ కంప్యూటర్ అనుభూతిని కలిగిస్తే? గూగుల్ ఈ కలను సాకారం చేయేందుకు సిద్ధమవుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ‘ఆండ్రాయిడ్ డెస్క్‌టాప్ మోడ్’ అనే సరికొత్త ఫీచర్‌ను గూగుల్ త్వరలో తీసుకురానుంది. ఇది ఫోన్‌ను పెద్ద స్క్రీన్‌కు కనెక్ట్ చేసినపుడు, పూర్తిగా డెస్క్‌టాప్ లుక్‌ కలిగిన ఇంటర్‌ఫేస్‌ను అందించే విధంగా పనిచేస్తుంది.

ఈ ఫీచర్ పైనే ప్రముఖ టెక్ విశ్లేషకుడు మిషాల్ రెహమాన్ తాజాగా స్పష్టత ఇచ్చారు. ఆయన వివరించినట్టు, పిక్సెల్ వంటి ఫోన్లను USB టైప్-C ద్వారా ల్యాప్‌టాప్ స్క్రీన్‌కు కనెక్ట్ చేస్తే, విండోలను రీసైజ్ చేయడం, స్క్రీన్‌లోనిచ్చిన చోటికి మౌస్‌తో మోపడం, టాస్క్‌బార్ ద్వారా యాప్స్ యాక్సెస్ చేయడం వంటి పూర్తి కంప్యూటర్ అనుభూతి లభించనుంది. ఇది సాంసంగ్ డెక్స్ లాంటి ఫీచర్లకు గట్టి పోటీనివ్వనుందన్నమాట.

అయితే గూగుల్ ఈ ఫీచర్‌ను ఎప్పుడు విడుదల చేస్తుందనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. మొదట ఆండ్రాయిడ్ 16తో రానుందని ఊహించగా, ఇప్పుడు ఆండ్రాయిడ్ 17తో రావచ్చు అని టిప్‌స్టర్లు చెబుతున్నారు. దీని ఇంటర్‌ఫేస్ మెరుగుదలపై ఇంకా పని జరుగుతోందని, అందుకే ఈ ఆలస్యం అంటూ ప్రచారం జరుగుతోంది.

ఫోన్‌తోనే డెస్క్‌టాప్ లాగా పని చేయాలనుకునే వారి కోసం ఇది రాబోయే కాలంలో మార్గదర్శక ఫీచర్‌గా మారనుంది. ముఖ్యంగా పనిలోనూ వినోదంలోనూ ఫోన్ వాడకాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే ఈ ఆండ్రాయిడ్ డెస్క్‌టాప్ మోడ్‌ విడుదలపై గూగుల్ నుంచి అధికారిక సమాచారం త్వరలో రావొచ్చని భావిస్తున్నారు.