దిల్ రాజు నిర్మాతగా టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ చైర్ లో ఉన్నారు అని చెప్పాలి. ప్రతి ఏడాది అరడజనుకు పైగా సినిమాలను ఆయన తన బ్యానర్ లో నిర్మిస్తున్నారు. మినిమమ్ రేంజ్ సినిమాల నుంచి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ వరకు కూడా ప్రస్తుతం తెరకెక్కుతున్నాయి. ఇదిలా ఉంటే ఒక్కోసారి దిల్ రాజు అంచనాలు తారుమారవుతూ ఉంటాయి.
ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మిన సినిమా థియేటర్స్ లోకి వచ్చిన తర్వాత డిజాస్టర్ అయ్యి భారీ నష్టాలను తీసుకొస్తున్నాయి. గత ఏడాది నాగచైతన్యతో చేసిన థాంక్యూ సినిమా మీద దిల్ రాజు చాలా హోప్స్ పెట్టుకున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే థియేటర్స్ లోకి వచ్చిన తర్వాత థాంక్యూ మూవీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
భారీ నష్టాలను దిల్ రాజుకి మిగిల్చింది. ఇక దిల్ రాజు కెరియర్ లో నిర్మాతగా నష్టపోయిన ప్రతిసారి డిస్ట్రిబ్యూటర్ గా డబ్బుని తిరిగి తెచ్చుకుంటున్నారు. అలాగే డిస్ట్రిబ్యూటర్ గా పోగొట్టుకున్న డబ్బులు నిర్మాతగా తిరిగి సంపాదిస్తున్నారు. ఈ కారణంగానే తాను సుదీర్ఘ కాలం పాటు ప్రొడ్యూసర్ గా కొనసాగలుగుతున్నాను అని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా దిల్ రాజు తెలిపారు.
అతని మాటలు వాస్తవమని మరోసారి ప్రూవ్ అయింది. శాకుంతలం సినిమా నిర్మాణంలో దిల్ రాజు బాగమై 40 కోట్ల వరకు పెట్టారంట. ఈ విషయాన్ని దర్శకుడు గుణశేఖర్ స్వయంగా పేర్కొన్నారు. ఒకవేళ అంత పెట్టకపోయినా కనీసం 20 కోట్లకి పైనే దిల్ రాజు శాకుంతలంపై పెట్టుబడి పెట్టారని ఇన్సైడ్ వర్గాల మాట. అయితే పెట్టిన పెట్టుబడిలో సగానికి పైనే దిల్ రాజు శాకుంతలంతో నష్టపోయారని చెప్పాలి.
ఇక ఈ మూవీ కొట్టిన దెబ్బ నుంచి డిస్ట్రిబ్యూటర్ గా వెంటనే విరూపాక్ష సినిమాతో దిల్ రాజు బయట పడబోతున్నారు. విరూపాక్ష నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఇక మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుని మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇప్పటికీ డీసెంట్ కలెక్షన్స్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. గత ఏడాది నిర్మాతగా థాంక్యూతో పోగొట్టుకున్నది డిస్ట్రిబ్యూటర్ గా బింబిసారాతో దిల్ రాజుకి వచ్చింది. ఇప్పుడు శాకుంతలం సినిమాతో పోగొట్టుకున్న డబ్బులు విరూపాక్ష డిస్ట్రిబ్యూషన్ ద్వారా వెంటనే రికవరీ చేసుకుంటున్నారు.