Gautam Gambhir: రోహిత్, విరాట్ టెస్ట్ రిటైర్మెంట్‌పై.. అనుమానాలపై ఓ క్లారిటీ ఇచ్చిన గంభీర్!

రోహిత్, విరాట్ వెంటవెంటనే టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం అభిమానులకే కాదు, భారత క్రికెట్ అభిమానులందరికీ షాక్ ఇచ్చింది. ఇద్దరూ ఒక్కసారిగా వైదొలగడం వెనుక కారణాలు ఏమిటనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియని విషయం. వారిని జట్టులో కొనసాగించేందుకు బీసీసీఐ హోల్డ్ చేసేందుకు ప్రయత్నించిందనే టాక్ వినిపించగా, విరాట్, రోహిత్ అసంతృప్తితోనే టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారనే కథనాలు విస్తరిస్తున్నాయి.

ఇక గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అవుతుండగా, ఫామ్ లో లేని ఈ ఇద్దరిపై అతడి నుంచి ఒత్తిడి ఎక్కువైందన్న గుసగుసలు కూడ వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా గంభీర్ స్పందిస్తూ, రిటైర్మెంట్ అంశాన్ని పూర్తిగా ఆటగాడి వ్యక్తిగత నిర్ణయంగా అభివర్ణించాడు. ‘‘ఎప్పుడు ఆట మొదలుపెట్టాలో, ఎప్పుడు ముగించాలో నిర్ణయించేది ఆటగాడే. బోర్డు, కోచ్, సెలక్టర్ ఎవరికీ అది చెప్పే హక్కు లేదు. ఆ నిర్ణయం ఒక అంతర్గత అనుభూతితోనే రావాలి’’ అని గంభీర్ స్పష్టం చేశాడు.

రోహిత్, విరాట్ లాంటి వాళ్ల రిటైర్మెంట్ వలన జట్టులో ఖచ్చితంగా ఒక లోటు తలెత్తుతుందని, అయితే అదే సమయంలో ఇది కొత్తవారికి దారితీసే అవకాశమని చెప్పాడు. టెస్ట్ క్రికెట్‌లో దశాబ్దానికి పైగా సత్తా చాటిన ఈ ఇద్దరిలాంటి ఆటగాళ్ల స్థానాన్ని భర్తీ చేయడం సవాలే అయినా, భారత జట్టులో యువ ఆటగాళ్లు ఉన్నతస్థాయిలో ఆడే సామర్థ్యం కలవారని గంభీర్ విశ్వాసం వ్యక్తం చేశాడు.

‘‘బుమ్రా లాంటి ప్రధాన బౌలర్ లేకపోయినా భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. అదే విధంగా కొత్త ఆటగాళ్లు కూడా ఇలా ఎదుగుతారు’’ అని గంభీర్ ఉదాహరణ ఇచ్చాడు. ఇక బీసీసీఐ శనివారం నాడు ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో, గంభీర్ – అగార్కర్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది.