నిలకడలేని ట్రాక్.. ఇలా అయితే ఎలా రాజా?

ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌కు పేరుగాంచిన మాస్ నటుడు రవితేజ ఇటీవల విడుదలైన రావణాసుర చిత్రంతో డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొంది, భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ, ఈ చిత్రం దాని హైప్‌ను అందుకోవడంలో విఫలమైంది. ఇక విడుదలైన మొదటి రోజు ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. దాంతో సినిమా కలెక్షన్లు దెబ్బతినడంతో పాటు సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టంగా మారింది.

రవితేజ కెరీర్‌లో ఇలాంటి ఫ్లాప్ ను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. అతని కెరీర్ మొత్తంలో హిట్స్ ఫ్లాప్స్ ను పెద్దగా గ్యాప్ లేకుండానే చూశాడు. రెండు హిట్‌లు వస్తే వెంటనే రెండు డిజాస్టర్‌లు వస్తున్నాయి. భారీ అంచనాలున్న సినిమాలు కూడా ఒక్కోసారి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి.

2014 నుంచి చూసుకుంటే అప్పట్లో పవర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ కిక్ 2 – బెంగాల్ టైగర్‌తో డిజాస్టర్లను చూశాడు. అదేవిధంగా, 2017లో రాజా ది గ్రేట్ విజయం తర్వాత, అతను టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోని డిస్కో రాజాతో వరుసగా నాలుగు డిజాస్టర్లను ఎదుర్కొన్నాడు.

2021 ప్రారంభంలో రవితేజ సూపర్ హిట్ క్రాక్‌తో తిరిగి పుంజుకోగలిగినప్పటికీ, ధమాకాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందించడానికి ముందు అతను ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీతో వరుసగా రెండు ఫ్లాప్‌లను ఎదుర్కొన్నాడు. ఇక ధమాకా, వాల్తేరు వీరయ్యతో ఓకే అనిపించే లోపే రావణాసురుడు మరోసారి మాస్ రాజా దెబ్బ తిన్నాడు. ఇక ఈ ఫ్లాప్ ఎదురైనప్పటికి, రవితేజ తన రాబోయే ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌తో పాన్-ఇండియా మార్కెట్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ హిట్లు, ఫ్లాప్‌ల కన్ఫ్యూజన్ ను అతను బ్రేక్ చేయగలడా అనేది చూడాలి.