సంక్రాంతి పండగకి ఐదు సినిమాలు పోటీలో ఉంటే అందులో రవితేజ నటించిన ‘ఈగల్’ సినిమాని వాయిదా వేయించారు. ఆ సమయంలోనే ఆ సినిమా నిర్మాతలు అయిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రతినిధులకు ఆ సినిమా ఎప్పుడు విడుదలైన సోలోగా విడుదల చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తామని ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హామీ ఇచ్చింది. ‘ఈగల్’ సంక్రాంతి పోటీ నుండి తప్పుకొని ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా ప్రకటన వచ్చింది.
అయితే అదేరోజు చాలా సినిమాలు విడుదలకి వున్నాయి. అందులో రజినీకాంత్ నటించిన ‘లాల్ సలామ్’, సందీప్ కిషన్’ఊరు పేరు భైరవకోన’, మహి వి రాఘవ రాజకీయ చిత్రం ‘యాత్ర 2’ ఫిబ్రవరి 8న విడుదలవుతున్నాయి. నిన్న ‘ఊరు పేరు భైరవకోన’ ట్రైలర్ విడుదల సందర్భంగా సందీప్ కిషన్ తాను రవితేజ సినిమాకి పోటీగా వస్తున్నాను అని ప్రకటించారు.
‘ఈగల్’ సినిమా నిర్మించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కి ఒక లెటర్ పంపింది. ‘మీరు అప్పుడు మా సినిమాకి సోలోగా విడుదల చేసుకోవటానికి వీలు కల్పిస్తామని మాట ఇచ్చారు, కానీ ఇప్పుడు చాలా సినిమాలు విడుదలవుతున్నట్టుగా వున్నాయి, మరి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి,’ అని ఛాంబర్ ని అడుగుతూ లెటర్ పంపారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు.
ఇందులో కావ్య తాపర్, అనుపమ పరమేశ్వరన్, నవదీప్, వినయ్ రాయ్, మధుబాల కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో మరోసారి రవితేజ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలనుకున్నారు.
కానీ ఇప్పుడు ‘ఈగల్’ సినిమాకు మళ్లీ పోటీ ఏర్పడింది. అదే రోజున రిలీజ్ అయ్యేందుకు చాలా సినిమాలు క్యూ కడుతున్నాయి. ఫిబ్రవరి 8న యాత్ర 2, ఫిబ్రవరి 9న ఊరు పేరు భైరవకోన, రజినీకాంత్ లాల్ సలామ్ డబ్బింగ్ చిత్రాలు విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయి. దీంతో తమకు సోలో రిలీజ్ డేట్ కావాలంటూ సదరు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు ఫిలిం ఛాంబర్‌కు లేఖ రాసింది.