Shankar: పొన్నియిన్ సెల్వన్ రేంజ్ లో శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్

టాలీవుడ్‌లో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. శంకర్ తన మొదటి స్ట్రెయిట్ తెలుగు చిత్రంగా రూపొందిస్తున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటినుంచీ మంచి స్పందన లభిస్తోంది. ఇండియన్ 2 పేలవ ప్రదర్శనతో ఎదుర్కొన్న విమర్శలు, ట్రోలింగ్ తర్వాత శంకర్ కు ఈ సినిమా చాలా కీలకమైంది. కథ, స్క్రీన్‌ప్లే, విజువల్స్‌లో తన వింటేజ్ మేజిక్ చూపించేందుకు శంకర్ ఈ చిత్రంతో మరింత శ్రద్ధ పెట్టారు.

జనవరి 10న విడుదల కానున్న ఈ సినిమా ఫలితం శంకర్ కెరీర్‌కి కీలక మలుపు కావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గేమ్ ఛేంజర్ విజయంతో శంకర్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వేల్పరికి కొత్త ఊపొస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మూడు భాగాలుగా రూపొందే ఈ పాన్ వరల్డ్ సినిమా వీరయుగ నాయగన్ వేల్పరి అనే చారిత్రక నవల ఆధారంగా తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి శంకర్ ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారట.

పొన్నియిన్ సెల్వన్ తరహాలో చారిత్రక నేపథ్యంతో వచ్చే ఈ చిత్రం శంకర్ యొక్క మరో గ్రాండియర్ విజువల్ ఎక్స్‌పీరియెన్స్‌గా నిలవనుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం వేల్పరిలో నటించబోయే హీరో పేరుపై సస్పెన్స్ కొనసాగుతోంది. బాలీవుడ్‌ స్టార్ రణవీర్ సింగ్ పేరు గతంలో వినిపించినప్పటికీ, ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. శంకర్ రణవీర్‌తో కలిసి పని చేసే ఆలోచనలో ఉన్నప్పటికీ, రణవీర్ సింగ్‌ డేట్స్ కుదిరే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

బాలీవుడ్‌ తరహా ప్రాజెక్ట్ కావడంతో అక్కడి స్టార్ హీరోలలో ఎవరో ఒకరు చరిత్రాత్మక పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, గేమ్ ఛేంజర్, ఇండియన్ 3 విజయవంతమైతే వేల్పరి మరింత వేగంగా రూపుదిద్దుకుంటుందని అంచనా. గేమ్ ఛేంజర్ విజయంతో శంకర్ తన మునుపటి గౌరవాన్ని తిరిగి పొందుతారనే నమ్మకంతో ఉన్నారు. మరి ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.