దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ రౌద్రం ‘రణం రుధిరం’. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాన్నాయి. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. కాగా దాదాపు 7 నెలల విరామం తర్వాత తిరిగి
ఆర్ ఆర్ ఆర్ సెట్స్ మీదకి వచ్చింది. ముందుగా సెట్స్ లో తారక్ అడుగు పెట్టాడు. ఈ నెల 5 న షూటింగ్ ప్రారంభం అవగా ఎన్టీఆర్ మీద చిత్రీకరణ జరుపుతున్నాడు రాజమౌళి.
అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ 2020 జులై 30న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ పూణె లో అనుకున్న షెడ్యూల్ క్యాన్సిల్ అవడంతో పాటు కరోనా కొట్టిన దెబ్బకి అన్ని ప్లాన్స్ తారుమారయ్యాయి. దాంతో 2021 జనవరి 8న సంక్రాతి సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్నారు. కాని అది కూడా సాధ్యపడలేదు. ఇలా ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ డేట్ ని ప్రకటించి అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోవడంతో ఈ సారి అన్నీ పక్కాగా కుదిరేంతవరకు ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ ని ప్రకటించనని దర్శకుడు రాజమౌళి తేల్చి చెప్పారు.
కాగా ‘ఆర్.ఆర్.ఆర్’ కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుని షూటింగ్ జరపనున్నారు. రెండు నెలలు షూటింగ్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరిగితే డిసెంబర్ లో విడుదల తేదీని ప్రకటించాలని రాజమౌళి బృందం భావిస్తున్నారట. అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం అనుకున్న ప్రకారం డిసెంబర్ లోపు ఆర్ ఆర్ ఆర్ టాకీపార్ట్ కంప్లీట్ అయితే ఖచ్చితంగా 2021 లో రాజమౌళి సెంటిమెంట్ ప్రకారం జూలై నెలలో రిలీజ్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తుంది.