టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కల్పించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఆయనను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యార్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీచేశారు. ఆయన ఈ పదవిలో రెండేండ్ల పాటు కొనసాగనున్నారు. దిల్ రాజు అసలు పేరు వెంకటరమణా రెడ్డి. 1990లో ‘పెళ్లి పందిరి’ సినిమాతో డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించారు.
అనంతరం ‘దిల్’ సినిమాతో నిర్మాతగా మారారు. ఆ చిత్రం విజయం సాధించడంతో ఆయన పేరు దిల్ రాజుగా మారింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలే కాకుండా చిన్న చిత్రాలు కూడా నిర్మిస్తూ అనేకమందికి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇండస్ట్రీలోకి కొత్తగా వస్తున్నవారిని ప్రోత్సహించేందుకు గాను దిల్ రాజు డ్రీమ్స్ పేరుతో కొత్త బ్యానర్ ప్రారంభిస్తున్నానని ఇటీవలే ప్రకటించారు. దీనికోసం ఒక వెబ్‌సైట్‌ను కూడా లాంచ్ చేయనున్నారు.
ఆయన ప్రస్తుతం మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అగ్ర దర్శకుడు శంకర్, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో ఆయన నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ జనవరి 10న, వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా జనవరి 14న విడుదల కానున్నాయి. వీటితోపాటు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘తమ్ముడు’ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.