‘హనుమాన్’ వివాదం ఇంకా చల్లారలేదు. సినిమా విడుదలయ్యేదాకా వివాదం కొనసాగుతూనే వుంటుంది. సినిమా అంటేనే అంత. ఎక్కువ థియేటర్లు కావాలని సంక్రాంతి నేపథ్యంలో ఏ సినిమా నిర్మాత అయినా అనుకుంటాడు. కానీ, ‘హనుమాన్’కి అనుకూల పరిస్థితులు కనిపించడంలేదు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘గుంటూరు కారం’ మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్న సంగతి తెలిసిందే. మూడు పెద్ద సినిమాలు, ఓ చిన్న సినిమా.. ఈ ఈక్వేషన్ పట్టుకుని ‘దిల్’ రాజు, థియేటర్లతో ఆట ఆడుతున్నారన్నది బహిరంగ రహస్యం.
‘మొత్తం దిల్ రాజే చేస్తున్నారు’ అనే టాక్ అయితే బయటకు వెళ్ళిపోయింది. అది నిజం కూడా.! ‘హనుమాన్’ టీమ్, చిరంజీవి దగ్గర థియేటర్ల విషయమై ఆవేదన వ్యక్తం చేయడంతో, ఆయన ‘దిల్’ రాజుతో ప్రత్యేకంగా మాట్లాడారట.
‘సినిమా బావుంటే, ఆటోమేటిక్‌గా జనం చూస్తారు, థియేటర్లకు జనం రావడం పెరుగుతుంది.. థియేటర్ల సంఖ్యా పెంచాల్సి వస్తుంది..’ అని ‘హనుమాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఈ మాటలు కాస్తా, దిల్ రాజుని టార్గెట్ చేసినవే.. అన్న ప్రచారం దరిమిలా, దిల్ రాజు స్వయంగా చిరంజీవికి వివరణ ఇచ్చుకున్నారన్నది ఇంకో యాంగిల్. అయినాగానీ, థియేటర్లు ‘హనుమాన్’కి అందాల్సిన స్థాయిలో అందేలా చూసేందుకు ‘దిల్’ రాజుకి మనస్కరించడంలేదట.