టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న బాలీవుడ్ భామల్లో దీపికా పదుకొణె ఒకరు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’లో ఆమె హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. వాస్తవానికి దీపికా కొన్నాళ్ల క్రితమే ఇక్కడి వారిని అలరించాల్సి ఉంది. కానీ, వీలుపడలేదు. ఆ ప్లాష్ బ్యాక్ ఏంటంటే..’ప్రేమించుకుందాం రా’, ‘బావగారూ బాగున్నారా’,’టక్కరి దొంగ’,’శంకర్‌దాదా ఎంబీబీఎస్’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు జయంత్ సి. పరాన్జీ. రణ్‌దీప్, మృదుల జంటగా ఆయన ‘లవ్ 4 ఎవర్’ చిత్రాన్ని రూపొందించారు.
అందులోని ప్రత్యేక గీతంలో దీపికా నటించారు. కారణం తెలియదుగానీ ఆ సినిమా విడుదల కాలేదు. తెలుగు ప్రేక్షకులకు ‘హాయ్’ చెప్పే అవకాశాన్ని అప్పుడు మిస్సైన ఆమె ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు.’కల్కి 2898 ఏడీ’ చిత్రం మే 9న విడుదల కానుంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాను కూడా ఈ ప్రాజెక్టులో భాగమైనట్లు రాజేంద్ర ప్రసాద్ ఓ ఈవెంట్‌లో తెలిపారు.
మహాభారతంతో మొదలై క్రీస్తుశకం 2898లో పూర్తయ్యే కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించి సినీ ప్రియుల్లో అంచనాలు రెట్టింపు చేశారు డైరెక్టర్. కన్నడ చిత్రం ‘ఐశ్వర్య’తో తెరంగేట్రం చేసిన దీపికా ‘ఓం శాంతి ఓం’తో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ‘కాక్‌టైల్’, ‘రేస్ 2’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘బాజీరావ్ మస్తానీ’, ‘పఠాన్’ వంటి చిత్రాల్లో వైవిధ్య పాత్రలు పోషించి మెప్పించారు.’బిల్లూ’, ‘దమ్ మారో దమ్’, ‘బాంబే టాకీస్’, ‘రాబ్తా’, ‘సర్కస్’ సినిమాల్లోని స్పెషల్ సాంగ్స్‌లో నటించి అలరించారు. ‘కల్కి’తోపాటు ‘సింగం అగైన్’తో బిజీగా ఉన్నారామె. సింగం ఫ్రాంఛైజీలో తెరకెక్కుతున్న మూడో సినిమా ఇది. అజయ్ దేవ్‌గణ్ హీరో. వ్యక్తిగతంగా దీపికా అభిమానులకు కొన్ని రోజుల క్రితం శుభవార్త చెప్పారు. తాను తల్లికాబోతున్నట్లు సోషల్ విూడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు.