డీప్‌ఫేక్ వీడియోస్.. ఈ పదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. అందుకు కారణం హీరోయిన్ల ఫేక్ వీడియోలు సోషల్ విూడియాలో వైరల్ కావడమే. డీప్‌ఫేక్ వీడియోలను కట్టడి చేసేందుకు కేంద్రం ఓ వైపు కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ.. దేశంలోని టాప్ హీరోయిన్లు మాత్రం ఒకరి తర్వాత ఒకరు దీని బారిన పడుతూనే ఉన్నారు.
ఇప్పటికే నేషనల్ క్రష్‌గా పేరుపొందిన దక్షిణాది తార రష్మిక మందన్నా, బాలీవుడ్ స్టార్ నటులు కత్రినా కైఫ్, కాజోల్, ఆలియా భట్‌కు సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా గ్లోబల్ స్టార్‌గా పేరుపొందిన బాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రా సైతం డీప్‌ఫేక్ బారిన పడ్డారు. పీసీకి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
అయితే, ఈ సారి ఆకతాయిలు నటి ముఖం మార్చకుండా వాయిస్‌ను మార్చేయడం గమనార్హం. ప్రియాంక గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియోకు ఇప్పుడు వాయిస్ మార్చేసి వైరల్ చేశారు. ఆ వీడియోలో ఆమె ఓ నకిలీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు క్రియేట్ చేశారు. ఆ బ్రాండ్ కారణంగా 2023లో తన వార్షిక ఆదాయం భారీగా పెరిగిందని.. అందరూ దాన్ని ఉపయోగించాలని పీసీ చెబుతున్నట్లుగా వీడియోను రూపొందించారు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలా కూడా క్రియేట్ చేస్తున్నారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా డీప్‌ఫేక్ వీడియోలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సినీతారలు ఒకరి తర్వాత ఒకరు వీటి బారిన పడుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సినీఇండస్ట్రీని తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. ముందుగా నటి రష్మిక మందన్నా సంబంధించిన ఓ డీప్‌ఫేక్ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.
జారా పటేల అనే ఓ సోషల్ విూడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ విూడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు, సినీ ప్రముఖులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ తర్వాత బాలీవుడ్ నటులు కత్రినాకైఫ్, కాజోల్, ఆలియా భట్ కూడా డీప్‌ఫేక్ బారిన పడ్డారు. మరోవైపు డీప్‌ఫేక్ వీడియోలపై కేంద్ర ఐటీ శాఖ తీవ్రంగా స్పందించింది. డీప్‌ఫేక్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఈ మేరకు సోషల్ విూడియా సంస్థలకు కూడా నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించింది.