నందమూరి బాలకృష్ణకు అభినందనల వెల్లువ!

నందమూరి బాలకృష్ణ, శ్రీలీల, కాజల్‌ అగర్వాల్‌ ముఖ్య తారాగణంగా విడుదలైన ‘భగవంత్‌ కేసరి’కి మంచి పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. అటు ప్రేక్షకుల నుంచి, ఇటు క్రిటిక్స్‌ నుంచి.. ఇక బాలకృష్ణ అభిమానులు అయితే సరేసరి! ఈ సినిమాకి మంచి ప్రసంశలు వస్తున్నాయి, బాలకృష్ణ మరోసారి బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చారు ఈ ‘భగవంత్‌ కేసరి’ తో అని అంటున్నారు.

బాలకృష్ణ ఈ సినిమాలో తన ఇంతకు ముందు సినిమాలలో కాకుండా ఒక సాత్వికమైన నటనతో ఆకట్టుకున్నారని చెబుతున్నారు. అలాగే దర్శకుడు అనిల్‌ రావిపూడి చెప్పిన కథ పాతదే అయినా అతను కొత్తగా చెప్పే విధానం, కథనం అందరినీ ఆకట్టుకుంటోంది అని అంటున్నారు. ఈ సినిమాకి అతని రచన అదే డైలాగులు, ఎమోషన్స్‌ కి ప్రేక్షకులు ముగ్దులవుతున్నారు.

మొదటిసారిగా బాలకృష్ణ తెలంగాణ యాసలో చెప్పే డైలాగులు, సహజంగా ఉన్నాయని, అలాగే పోరాట సన్నివేశాలు కూడా బాగున్నాయని అంటున్నారు. ఇక ఈ సినిమా దసరా పండగ సందర్భంగా విడుదలవ్వటం, అందరూ బాగుంది అనటంతో ఇక బాలకృష్ణకి అభినందనల వెల్లువ మొదలైంది.

ఈ చిత్ర దర్శకుడు అనిల్‌ రావిపూడి, ఇందులో నటించిన శ్రీలీల, ఛాయాగ్రహణం అందించిన రాంప్రసాద్‌, అలాగే నిర్మాతలు బాలకృష్ణ ఇంటికి వెళ్లి అతన్ని అభినందించారు. ఈ సినిమాలో శ్రీలీల నటన అద్భుతంగా వుందని, ఆమె ఎమోషన్స్‌ తో పాటు.. పోరాట సన్నివేశాలు కూడా బాగా చేసిందని అభివర్ణిస్తున్నారు.