తాజాగా జరిగిన సినీ ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. కమెడియన్ అలీపై అసభ్యంగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, అందుకు సంబంధించి సీనియర్ నటుడు అలీ స్పందించడంతో విషయం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే తనపై వచ్చిన వ్యాఖ్యలను అలీ పెద్దగా తీసుకోకపోవడం, అందులో ఉన్న పరిస్థితుల్నే పేర్కొనడం నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.
తనపై రాజేంద్ర ప్రసాద్ ఉద్దేశపూర్వకంగా ఏమీ అనలేదని అలీ స్పష్టంగా చెప్పారు. “ఆయన ఈ మధ్యకాలంలో తీవ్రమైన వ్యక్తిగత విషాదంలో ఉన్నారు. కుమార్తెను కోల్పోయిన బాధ ఇంకా మిగిలే ఉంది. అలాంటప్పుడు మనుషుల మాటలు తూలుతాయి. ఏదైనా సరదాగా అన్నా, బయటకు వేరు వేరు అర్థాలుగా వస్తాయి,” అంటూ అలీ మాట్లాడుతూ కనిపించారు.
అలీ విడుదల చేసిన వీడియోలో, “ఆయన నిజంగా మంచి వ్యక్తి. పెద్ద మనిషి. పుట్టెడు బాధను మోస్తున్న ఆయన నుంచి అలాంటి మాటలు రావడం అనుకోకుండా జరిగిందే. ఈ విషయంలో ఎవరూ తప్పుగా భావించకండి. దీనిని పెద్దది చేయాల్సిన అవసరం లేదు” అని కోరారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటిజన్ల మనసులను తాకుతున్నాయి.
ఇదే సమయంలో, రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ, తన కామెంట్లు సరదాగా చేసినవేనని, దాన్ని ఎవరికీ క్షోభ కలిగించాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. “నాకు తెలిసిన వాళ్లతో సరదాగా మాట్లాడుతుంటే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అది వారి స్వభావంపై ఆధారపడి ఉంటుంది,” అని వ్యాఖ్యానించారు.
మొత్తానికి ఈ వివాదానికి అలీ స్పందనతో ఓ ముగింపు లభించినట్టుగానే కనిపిస్తోంది. ఇద్దరూ సినీ రంగంలో మానసికంగా దగ్గరగా ఉన్న వారైనందున, ఒకరిపై మరొకరు ఇంత సానుకూలంగా స్పందించడం మంచి మానవీయతకే నిదర్శనం అంటున్నారు సినీ వర్గాలు.