పుష్ప హడావుడి దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇక డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా నాలుగు ఆసక్తికర సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ చిత్రాలు భిన్నమైన జానర్‌లతో రూపొందించబడటమే కాకుండా, డిసెంట్ అంచనాలతో థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ఒక విధంగా అన్ని సినిమాలు కంటెంట్ నే నమ్ముకున్నాయని చెప్పవచ్చు. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద క్లిక్కయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలుగు నుంచి రెండు స్ట్రైట్ సినిమాలు, రెండు డబ్బింగ్ చిత్రాలు ఈ బరిలో ఉన్నాయి. అల్లరి నరేష్ హీరోగా, సుబ్బు దర్శకత్వంలో వచ్చిన ‘బచ్చలమల్లి’ సినిమా రియలిస్టిక్ సంఘటనల ఆధారంగా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది.
ట్రైలర్‌కు వచ్చిన సానుకూల స్పందన సినిమాపై అంచనాలను పెంచింది. మరి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా అనేది చూడాలి. అదే విధంగా, ప్రియదర్శి ప్రధాన పాత్రలో, ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించిన ‘సారంగపాణి జాతకం’ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జాతకాల నేపథ్యంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌పై ప్రియదర్శి చాలా ఆశలు పెట్టుకున్నారు. వరుస ఫ్లాప్‌ల తర్వాత ఇంద్రగంటి ఈ సినిమా తనకు నమ్మకాన్ని తెచ్చిపెడుతుందనే విశ్వాసంతో ఉన్నారు.
ఇక పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఉపేంద్ర స్వీయ దర్శకత్వం ‘UI’ కూడా ఈ శుక్రవారం విడుదల కానుంది. విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్, ఉపేంద్రకు ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తుందనడంలో సందేహం లేదు. గతంలో ‘A’ మూవీతో సృష్టించిన మ్యాజిక్‌ను ఈ సినిమాతో కూడా రిపీట్ చేస్తాడని అతడి ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
తమిళం నుంచి వెట్రిమారన్ రూపొందించిన ‘విడుదల 2’ కూడా ఈ బరిలో ఉంది. విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా, నక్సల్స్-పోలీసుల మధ్య ఘర్షణలను ఆధారంగా తీసుకుని రూపొందింది. ‘విడుదల’ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇలా భిన్నమైన కథాంశాలతో క్రిస్మస్ బరిలో నిలిచిన ఈ నాలుగు సినిమాల్లో, ఎన్ని కమర్షియల్‌గా విజయవంతం అవుతాయో వేచి చూడాలి.