మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు పరిచయాలు అక్కర్లేదు. స్వశక్తితో, ఎవరి అండదండలు లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి అంచెంలంచెలుగా ఎదిగారు చిరంజీవి. ప్రస్తుతంమెగాస్టార్గా పిలిపించుకుంటున్న చిరు అభిమానులకు అన్నయ్యగా, శ్రేయోభిలాషులకు ఆపద్భాందవుడిలా, ఇండస్ట్రీకి గ్యాంగ్ లీడర్‌గా మారారు. ఎంత ఎత్తు ఎదిగిన ఒదిగి ఉండే తత్వం చిరంజీవి. గొప్ప విజయాలు సాధించిన పొంగిపోని చిరంజీవి అపజయాలకు కూడా ఏ రోజు కుంగిపోలేదు.
కెరీర్లో 151 సినిమాలు చేసి ఎవరికి అందనంత ఎత్తులో నిలిచిన చిరంజీవి ప్రస్తుతం కుర్ర హీరోలతో పోటీపడుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న చిరు ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు సన్నద్దమవుతున్నారు. ఈ మూవీ తర్వాత లూసిఫర్ రీమేక్‌ని తమిళ దర్శకుడితో కలిసి చేయనుండగా, వేదాళం రీమేక్‌ని మెహర్ రమేష్ దర్శకత్వంలో చేయనున్నాడు. కరోనా వలన కాస్త స్లో అయిన చిరు రానున్న రోజులలో తన సినిమాలతో అభిమానులలో జోష్ పెంచనున్నాడు.
తాజాగా చిరంజీవి సమంత హోస్ట్ చేస్తున్న సామ్ జామ్ షోకు గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ షోలో మనసు విప్పి మాట్లాడారు. సినీ, రాజకీయం, పర్సనల్ లైఫ్‌లో తనకు ఎదురైన ఇబ్బందులు గురించి కూడా చెప్పుకొచ్చాడు. 1983లో వచ్చిన ఖైదీ చిత్రంతో మంచి హిట్ కొట్టిన చిరంజీవి ఈ సినిమా సక్సెస్ తో చాలా జోష్‌లో ఉన్నాడు. దీంతో మళ్ళీ ఇదే కాంబినేషన్లో వేట అనే చిత్రం చేశాడు. 1986లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో ఆ బాధను దిగమింగుకోలేక దుప్పటి కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చేశాడట. ఈ బాధను మరిచిపోవడానికి చిరుకి చాలా టైం పట్టిందని తన తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.