టాలీవుడ్ ఇండస్ట్రీకి సరికొత్త దారులు చూపెట్టిన అగ్ర కథానాయకుడు చిరంజీవి. నటనతో పాటు డ్యాన్స్ , ఫైట్స్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ప్రేక్షకులని ఎంతగానో అలరించాడు. ఆరుపదుల వయస్సులోను కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు చిరు. సాధారణ మధ్య తరగతి ఫ్యామిలీ నుండి వచ్చిన చిరు ఎంతో కష్టపడి ఈ స్థితికి చేరుకున్నారు. చిరు స్థాయికి రావడం వెనుక ఆయన తండ్రి కృషి కూడా ఉందని చాలా సార్లు చెప్పారు.
అయితే మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ఆయన తనయుడు రామ్ చరణ్ .. చిరుతో కలిసి నటించేందుకు చాలా ఆసక్తి చూపాడు. రామ్ చరణ్ నటించిన మగధీర సినిమాలో చిరు గెస్ట్ రోల్‌లో కనిపిస్తే, మెగాస్టార్ నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రంలో చెర్రీ.. అమ్మడు లెట్స్ డూ పాటలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఆచార్యలోను వీరిద్దరు కలిసి నటించనున్నారనే ప్రచారం జరుగుతుంది. చిరంజీవి .. తన కుమారుడితోనే కాక తమ్ముళ్ళు.. పవన్, నాగబాబుతో కూడా కలిసి నటించారు. బామ్మర్ధి అల్లు అరవింద్, మేనల్లుడు అల్లు అర్జున్ కూడా చిరు సినిమాలో మెరిసారు.
చిరంజీవి తండ్రి వెంకట్రావుకు కూడా సినిమాలపై మక్కువ ఎక్కువ. జగత్ కిలాడీలు సినిమాలో నటించిన వెంకట్రావు చిరంజీవితో కలిసి మంత్రిగారి వియ్యంకుడు సినిమాలో నటించారు ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈ సినిమాలో దర్శకుడు బాపు గారు మంత్రి గారి వేషం కోసం వెతుకుతూ ఉంటే… అల్లు రామలింగయ్య వెంట్రావు గారి పేరును బాపు గారికి పేరు సజెస్ట్ చేశారట. దీంతో ఆయన ఈ సినిమాలో నటించాడు. కాని చిరు, వెంకట్రావు ఏ ఫ్రేంలో కలిసి కనిపించరు. కాకపోతే తను నటించిన సినిమాలో తండ్రి నటించారనే సంతృప్తి మాత్రం చిరంజీవికి ఉంటుంది.