ఫిబ్రవరి1 నుంచి ‘విశ్వంభర’ షూటింగ్‌ లో పాల్గొననున్న చిరంజీవి.

మెగాస్టార్‌ చిరంజీవికి పద్మవిభూషణ్‌ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తరువాత చిత్ర పరిశ్రమ అంతా చిరంజీవిని అభినందన వెల్లువలతో ముంచెత్తారు. చిరంజీవి ఈ అవార్డుకు అన్ని విధాలా అర్హుడు అంటూ కొనియాడారు. ఇదిలా ఉండగా చిరంజీవి తన తదుపరి సినిమా ‘విశ్వంభర’ ఒక ఫాంటసీ నేపథ్యంలో చేస్తున్న సంగతి తెలిసిందే.

దీనికి మల్లిడి వశిష్ట దర్శకుడు, ఈ సినిమా షూటింగ్‌ కూడా ఎప్పుడో మొదలైంది. ఈ సినిమాకి ముందుగానే చాలా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరిగాయి. ఎందుకంటే ఈ సినిమాకి కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ చాలా అవసరం అవుతాయి. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా రివీల్‌ చేస్తూ టీజర్‌ ఒకటి విడుదల చేశారు, అది వైరల్‌ అయింది కూడా.

అయితే ఇప్పుడు చిరంజీవి షూటింగ్‌ ఎప్పుడు మొదలు పెడుతున్నారు అనే విషయం మీద ఒక అప్డేట్‌ వచ్చింది. ఫిబ్రవరి 1 నుండి చిరంజీవి ఈ సినిమా షూటింగ్‌ మొదలెడుతున్నట్టుగా తెలిసింది.

నిన్న చిరంజీవిని అభినందించడానికి వచ్చిన వాళ్ళతో పిచ్చా పాటీ మాట్లాడుతూ తాను ఫిబ్రవరి 1 నుండి ‘విశ్వంభర’ సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్నట్టుగా చెప్పారు. సుమారు రెండు వారాలు ఈ సినిమా షూటింగ్‌ లో చిరంజీవి పాల్గొంటారని తెలిసింది.

ఆ తరువాత చిరంజీవి ఒక చిన్న బ్రేక్‌ తీసుకోవడానికి అమెరికా పయనం అవుతున్నట్టుగా కూడా తెలిసింది. తరువాత మళ్ళీ ఈ సినిమా షూటింగ్‌ లో నిరవధికంగా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ సినిమా యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తుండగా, ఎం. ఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.