విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి మరణ వార్త సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. నేడు (సెప్టెంబర్ 8) తెల్లవారుఝామున గుండెపోటుతో మరణించారన్న వార్త తెలిశాక.. సినీ ప్రముఖులంతా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. హీరోలు, హీరోయిన్లు, దర్శకనిర్మాతలు సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అవుతున్నారు.
‘సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి మృతి ఇండస్ట్రీకి తీరని లోటు. జయప్రకాష్ రెడ్డి గారితో నేను ఆఖరిగా చేసింది ఖైదీ నెంబర్ 150 సినిమాలో. ఆయన గొప్ప నటుడు. ‘నాటక రంగం నన్ను కన్న తల్లి.. సినిమా రంగం నన్ను పెంచిన తల్లి’ అనే వారు. ‘అందుకే ఇప్పటికీ శని, ఆది వారాల్లో షూటింగ్‌లు పెట్టుకోనండి.. స్టేజ్ మీద పర్ఫామెన్స్ ఇస్తుంటాను. మీరెప్పుడైనా రావాలి’ అని అడిగేవారు. ఆ అవకాశాన్ని నేను పొందలేకపోయాను. సినిమాల్లో రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది జయప్రకాష్ రెడ్డి గారే. తనకంటూ ఒక ప్రత్యేకమైన ట్రెండ్ సృష్టించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అంటూ చిరంజీవి పేర్కొన్నాడు.
‘ఎన్నో మంచి పాత్రలతో మెప్పించిన విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి గారి మృతి విచారకరం, పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను’ అని నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.
‘మై డియర్ అంకుల్.. నా కెరీర్ ప్రారంభం నుంచీ మీరు నాకు తెలుసు. మీరు నాపై కురిపించిన ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేను. ప్రతీ సన్నివేశాన్ని మీ ఉత్సాహంతో నటించి నింపేశారు. మీరెప్పుడూ ఓ మాటతోనే ఫోన్‌ను కట్ చేసేవారు. ‘నాన్న మనం ఇక్కడి వారమే.. మనం సినిమా రంగానికి చెందినవారమే’ అదే నాకు మీ ఆశీర్వాదంలా నా వెంటే ఉంటుంది. మీ గురించి నాకు తెలిసినందుకు నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను. జేపీ అంకుల్ మీ ఆత్మకు శాంతి చేకూరాలి. మిమ్మల్ని మిస్ అవుతున్నాం.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అంటూ శ్రీనువైట్ల ట్వీట్ చేశాడు.
‘జేపీ గారితో నా ప్రయాణం ఎంతో ప్రత్యేకం. దాదాపు నా ప్రతీ సినిమాలో ఆయన ఉన్నారు. నన్ను ఆయన సొంత మనిషిలా భావించేవారు. ఎంతో ప్రేమగా పలకరించేవారు. నేను ఆయన్ను కచ్చితంగా మిస్ అవుతాను. మీ ఆత్మకు శాంతి కలగాలి సర్.. వ్యక్తిగతంగా గానీ నటనలో గానీ మీ లోటు పూడ్చలేనిది సర్’ అంటూ అనిల్ రావిపూడి ఎమోషనల్ అయ్యాడు.
‘జయప్రకాష్ రెడ్డి గారి మరణ వార్త విని షాక్ అయ్యాను. ఈ విషయం తెలిసి ఎంతో కలత చెందాను. ఎంతో విలక్షణమైన నటుడు మరణించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.. మేమంతా మిమ్మల్ని మిస్ అవుతాము సర్’ అంటూ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ట్వీట్ చేశాడు.
‘అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాష్ రెడ్డి గారు ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’ అని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యాడు.
‘సహచర నటుడు జయప్రకాష్ రెడ్డి గారు హఠాన్మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. నటనంటే ఆయనకు ప్రాణం. అటు వెండితెరపైన, ఇటు స్టేజ్ నాటకాలలోను పోషించిన పాత్రలకు ప్రాణం పోసిన నటుడాయన. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నాను. మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్స్.. ఆత్మకు శాంతి కలగాలి’ అని ప్రకాష్ రాజ్ ఎమోషనల్ అయ్యాడు.
‘జయప్రకాష్ రెడ్డి మరణ వార్త విని ఎంతో కలత చెందాను. ఇండస్ట్రీలో ఓ గొప్ప నటుడు, కమెడియన్. ఆయనతో కలిసి చేసిన ప్రతీ క్షణం, ప్రతీ మూమెంట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబానికి, ఆయన్ను అభిమానించే వారందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని మహేష్ బాబు ట్వీట్ చేశాడు.
‘డియర్ జయప్రకాష్ రెడ్డి గారు.. మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్స్.. రెడీ సినిమా సెట్‌లో మిమ్మల్ని మొదటి సారి చూసినప్పటి నుంచి ఓ గ్రేట్ ఫీలింగ్ కలిగింది..మీ ఆత్మకు శాంతి చేకూరాలి సర్’ అంటూ రామ్ ఎమోషనల్ అయ్యాడు.