చిరు తన తదుపరి చిత్రాల గురించి ఓ క్లారిటీ ఇచ్చాడు. కొరటాలతో చేస్తోన్న ఆచార్య సినిమా పూర్తయిన తరువాత బాబీ, మెహర్ రమేష్‌లతో సినిమాలు చేస్తానని, వివి వినాయక్‌తో ఓ సినిమా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో మెహర్ రమేష్ చేసి అజిత్ నటించిన వేదాళం రీమేక్. కోల్‌కత్తా బ్యాక్ గ్రౌండ్‌లో ఉండే ఈ సినిమా స్క్రిప్ట్ చిరుకు బాగానే నచ్చినట్టుంది.
అయితే అలాగే లూసిఫర్ సినిమా కూడా చిరుకు బాగానే నచ్చింది. మోహన్ లాల్ నటన, ఆ టేకింగ్,ఎలివేషన్ సీన్స్ చూసి చిరు బాగా ముచ్చటపడ్డట్టున్నాడు. మన తెలుగులోనూ ఇంతే పవర్ ఫుల్‌గా తెరకెక్కించాలని బాగానే పట్టుబట్టాడు. అందుకోసం మొదటగా సుజిత్‌ను రంగంలోకి దించాడు. ఆ తరువాత వివి వినాయక్‌కు బాధ్యతలు అప్పగించాడు. కానీ వినాయక్ స్క్రిప్ట్ రెడీ చేయడం, మెప్పించడంలో విఫలమైనట్టు వార్తలు వచ్చాయి.
చివరకు లూసిఫర్ రీమేక్‌పై అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. ఎడిటర్ మోహన్ తనయుడు జయం మోహన్ రాజా (హనుమాన్ జంక్షన్ దర్శకుడు)ను లూసిఫర్ రీమేక్‌కు దర్శకుడిగా చిరు ఫిక్స్ చేసేశాడు. ఈ మేరకు కొణిదెల ప్రొడక్షన్, ఎన్వీ ప్రసాద్ కలిసి ఈ ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాదిలో తెరకెక్కించనున్నట్లు తెలిపారు. మొత్తానికి మన దర్శుకులను చిరు పక్కన పెట్టేశాడని, మనవాళ్లు మెప్పించలేకపోయారని అందుకే తమిళ డైరెక్టర్‌ను ఫిక్స్ చేసేశాడని టాక్ వినిపిస్తోంది. జయం మోహన్ రాజా తమిళంలో తని ఒరువన్ దర్శకుడు. అదే సినిమాను ధృవగా తెలుగులో రీమేక్ చేశారు. అలా కలిసిన బంధంతోనే లూసిఫర్ బాధ్యతలను రామ్ చరణ్ జయం మోహన్ రాజాకు ఇచ్చాడనే టాక్ కూడా నడుస్తోంది.