కొంప ముంచిన మెగాస్టార్ చిరంజీవి తొందరపాటు.!

మెగాస్టార్ చిరంజీవికి తొందరెక్కువ.! ఔను, తమిళనాట సినీ నటి త్రిష – నటుడు మన్సూర్ అలీ ఖాన్ మధ్య ఓ వివాదం తెరపైకొచ్చిన సంగతి తెలిసిందే.

చాలా సినిమాల్లో రేపిస్టుగా నటించాననీ, ‘లియో’ సినిమాలో తనకు ఛాన్స్ రాగానే, హీరోయిన్ త్రిషతో రేప్ సీన్ వుంటుందనుకున్నాననీ, అదేమీ లేకపోవడంతో బాధగా అనిపించిందనీ మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యానించాడు. దాన్ని త్రిష తీవ్రంగా ఖండించింది.

ఈ వ్యవహారంపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు, త్రిషకు అండగా నిలిచారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి నితిన్, త్రిషకి మద్దతుగా నిలిచాడు, మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యల్ని తప్పు పట్టాడు.

మెగాస్టార్ చిరంజీవి కూడా, ఒకప్పటి తన కో-స్టార్‌కి మద్దతుగా నిలుస్తూ, ట్వీటేశారు. మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలు అస్సలు సమర్థనీయం కావని చిరంజీవి తన ట్వీటులో పేర్కొన్నారు. నిజానికి, మెగాస్టార్ చిరంజీవి చేసింది తప్పేం కాదు. కానీ, చిరంజీవి దారుణంగా ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు.

కీర్తి సురేష్‌తో చిరంజీవి ‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వ్యవహరించిన తీరు మీద అప్పట్లో చాలా విమర్శలొచ్చాయి. ఆ వ్యవహారాన్ని మళ్ళీ తిరగతోడి, చిరంజీవిని నానా రకాలుగా తిడుతున్నారు. కెలికి మరీ తిట్టించుకోవడమేంటి.? అంటూ, చిరంజీవి మీద ఆయన అభిమానులే ఒకింత అసహనం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వస్తోంది.