మెగా బ్రదర్ నాగబాబు నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల మనసులలో చెరగిన ముద్ర వేసుకున్న నాగబాబు నిర్మాతగా ఆరెంజ్ అనే సినిమా తెరకెక్కించి చేతులు కాల్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత మళ్ళీ నిర్మాణం వైపు అడుగుపెట్టలేదు. అయితే ఈ చిత్రం తర్వాత నాగబాబు ఆర్ధిక పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఈ సమయంలో పవన్ కళ్యాణ్, చిరంజీవి ఆయనకు అండగా నిలబడ్డారు.
జబర్ధస్త్ కార్యక్రమంతో నాగబాబు ఆర్ధిక పరిస్థితి కుదుటపడింది. చాలా సంవత్సరాల పాటు ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా పని చేసిన నాగబాబు కొన్ని కాసులు వెనుక వేసుకున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా రాణిస్తుంటే, కూతురు నిహారిక యాంకర్‌గా, హీరోయిన్‌గా అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఇక గత ఎలక్షన్స్‌లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి ఓడిన నాగబాబు వచ్చే ఎలక్షన్స్‌లో తప్పక గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాడు. ఇక కొద్ది రోజుల క్రితం కరోనాని జయించి యోధుడిగా మారాడు. ప్లాస్మా కూడా దానం చేసి తన భాద్యతను నిర్వర్తించాడు.
ఈ రోజు నాగబాబు బర్త్‌డే సందర్భంగా మెగా హీరోలు చిరంజీవి, సాయి ధరమ్ తేజ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆయనకు బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిరంజీవి తన తమ్ముడికి ప్రత్యేక శుభాకాంక్షలు అందించారు. పవన్, నాగబాబుతో దిగిన ఫోటోని షేర్ చేస్తూ..విధేయుడు, ఎమోషనల్ పర్సన్, దయా హృదయమున్న వ్యక్తి, చాలా సరదాగా ఉండే మంచి మనిషి, నా సోదరుడు నాగబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని , నీ ప్రతి పుట్టినరోజుకి అది మరింత బలపడాలని ఆశిస్తున్నాను!” అని ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన నాగబాబు థ్యాంక్యూ అన్నయ్య.. ఎప్పటికీ నీ వెంటే ఉంటాను అని బదులిచ్చారు.