చిరంజీవితో వెంకటేష్.! నాలుగు కథలు, నలుగురు డైరెక్టర్లు.!

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో సినిమా.. అంటూ ఓ ప్రచారం తెరపైకొచ్చింది. ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్ళాల్సిన ప్రాజెక్ట్ అది. అనివార్య కారణాల వల్ల వర్కవుట్ అవలేదంతే. గతంలో పలువురు దర్శకులు ఆ ప్రయత్నాలు చేశారు. నిర్మాతలూ ప్రయత్నించారు.

సీనియర్ ప్రొడ్యూసర్ రామానాయుడు చాలా సందర్భాల్లో చిరంజీవితో సినిమా, అందులో వెంకటేష్ కూడా నటిస్తే చూడాలని వుందన్నారు.. కానీ, అది కుదరలేదు. అయితే, ఇప్పుడు చిరంజీవి, వెంకటేష్ కలిసి నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ కథ రెడీ చేశారన్నది తాజా గాసిప్స్ సారాంశం. అదెంత నిజమోగానీ, పూరి జగన్నాథ్ వైపు నుంచి కూడా ఓ స్క్రిప్టు రెడీగా వుదంటూ ఇంకో గాసిప్ పుట్టుకొచ్చింది.

ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ ఏకంగా బౌండెడ్ స్క్రిప్టులు పట్టుకుని తిరుగుతున్నారంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కథ నచ్చితే, చిరంజీవితో సినిమా చేయడానికి రెడీ.. అంటూ ఇటీవల వెంకటేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

చిరంజీవి, వెంకటేష్.. ఇద్దరూ ఓకే అనాలిగానీ, కథలెంతసేపు.? నిర్మాణ సంస్థలు ముందుకు రావడమెంతసేపు.? ఓ మాంఛి కామెడీ ఎంటర్టైనర్, ఓ యాక్షన్ థ్రిల్లర్.. ఇలాంటి కాన్సెప్ట్స్‌తో చిరంజీవి, వెంకటేష్ అప్రూవల్ కోసం నాలుగు కథలు సిద్ధంగా వున్నాయన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం.