కమల్‌ అంతటి నటుడిని చూడలేదు: ‘భారతీయుడు’ ప్రీ ఈవెంట్‌లో బ్రహ్మానందం

‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొనడం తన అదృష్టమని నటుడు బ్రహ్మానందం అన్నారు. కమల్‌ హసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు -2’ జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసందర్భంగా తాజాగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం మాట్లాడుతూ కమల్‌ హాసన్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందన్నారు. కమల్‌ హాసన్‌ వయసు ఎంతో నాకు తెలీదు. నేను చదువుకునే రోజుల నుంచి ఆయన్ని చూస్తూనే ఉన్నా. ‘సాగర సగమం’ చాలాసార్లు చూశాను. అందులో ఆయన నటించిన విధానం చూస్తే ఆశ్చర్యమేసింది.

కమల్‌ హాసన్‌ శరీరంలోని ప్రతిభాగం పరిధిమేరకు నటిస్తుంది. అలా చేయగల ఏకైక నటుడు ప్రపంచంలో కమల్‌ హాసన్‌ మాత్రమే. ఆయన గొప్ప నటుడని ప్రతిఒక్కరూ అని తీరాలి. ఇండస్త్రీలో ఉన్న నటులంతా కమల్‌హాసన్‌ చేసిన పాత్రల్లాంటివి ఒక్కసారైనా చేస్తే బాగుండు అనుకుంటారు. ఆయన మేకప్‌ వేసుకోవడం కోసం ఒక్కోసారి 7గంటల సమయం తీసుకుంటారు. తన జీవితాన్ని ఇండస్ట్రీకి అంతలా అంకితమిచ్చారు. ఎప్పుడూ మేకప్‌, యాక్టింగ్‌ ఈ రెండింటి గురించే ఆలోచిస్తారు.

ఆయన చేయని పాత్రలు లేవు. ప్రతి పాత్రకు జీవం పోస్తారు. ముఖ్యంగా ‘భారతీయుడు’లో ఆయన నటన అద్భుతం. భారతీయ సినీపరిశ్రమలో శంకర్‌ లాంటి ప్రతిభ ఉన్న దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ చిత్రబృందంలోని వారితో నేను గతంలోనూ పని చేశానని చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది. కానీ, కమల్‌ హాసన్‌తో కూడా కలిసి పనిచేశాను అని చెప్పడానికి గర్వంగా ఉంది. ఆయన సినిమాలో మనం చేశాం అని కొన్ని దశాబ్దాల తర్వాత కూడా గుర్తుతెచ్చుకొని ఆనందిస్తాం అంటూ ప్రశంసలు కురిపించారు. తాను కాలేజీలో చదువుకొనే సమయంలో మిమిక్రీ చేసినట్లు బ్రహ్మానందం తెలిపారు.

అందరూ ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌లను ఇమిటేట్‌ చేస్తే తాను మాత్రం కమల్‌ హాసన్‌ వాయిస్‌ని మిమిక్రీ చేసేవాడినన్నారు. ఇటీవల శ్రుతిహాసన్‌ ఎదుట మిమిక్రీ చేస్తే ’నాన్నలానే మాట్లాడారు’ అని చెప్పడంతో తనలో ఇంకా కాన్ఫిడెన్స్‌ పెరిగిందని తెలిపారు. స్టేజ్‌పై కమల్‌ హాసన్‌లా మాట్లాడి ఈ హాస్యబ్రహ్మ అందరినీ అలరించారు.