Box Office Fight: ఒకేసారి మూడు పెద్ద సినిమాలు.. బాక్సాఫీస్ ఫైట్ ఏ రేంజ్ లో ఉంటుందో?

వచ్చే ఏడాది దసరా సీజన్ టాలీవుడ్ బిగ్గెస్ట్ క్లాష్‌కు వేదిక కానుంది. ఇప్పటికే 2025 మూడు భారీ చిత్రాలు సెప్టెంబర్ చివరి వారానికి తమ విడుదల తేదీలను ప్రకటించాయి. ఈ సినిమాల మధ్య పోటీ ఎంత తీవ్రంగా ఉండబోతుందో ఇప్పుడు సినీ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి. ముఖ్యంగా, ఈ చిత్రాల్లో రెండు పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు కలిగినవే కావడం విశేషం.

సాయిధరమ్ తేజ్ నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ మూవీ సెప్టెంబర్ 25న విడుదలకు సిద్ధమైంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌ వీడియో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సిక్స్ ప్యాక్ బాడీతో సాయి ధరమ్ తేజ్ మాస్ లుక్ ఆకట్టుకుంటోంది. ఎమోషన్స్‌తో పాటు ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. మేకర్స్ ఇప్పటివరకు సినిమా కథ గురించి క్లారిటీ ఇవ్వకపోయినా, గ్లింప్స్‌లో వచ్చే సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

అదే రోజున ‘అఖండ-2’ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్యూర్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్‌లతో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉండనుంది. విడుదల తేదీ ప్రకటనతో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

అదే సమయంలో కన్నడ ఇండస్ట్రీ నుంచి ‘కాంతార: ఛాప్టర్ 1’ కూడా దసరా రేసులో నిలిచింది. రిషబ్ శెట్టి నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కాంతార’ మొదటి భాగం ఇచ్చిన ఎమోషనల్ కనెక్ట్ దృష్ట్యా, ప్రీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేచర్‌ను నమ్ముకుని సాగిన కథ, సూపర్ నేచురల్ అంశాలు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ మూడు సినిమాలు మూడు విభిన్న జోనర్లలో ఉండబోతున్నాయి. అయితే, ఒకే సీజన్‌లో భారీ చిత్రాల పోటీ బాక్సాఫీస్ వసూళ్లపై ప్రభావం చూపడం ఖాయం. ఒకటి వాయిదా వేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.