బిగ్‌బాస్ నాల్గో సీజన్‌ను గమనిస్తున్నవారికి ఓ విషయం స్పష్టం అర్థమవుతుంది. దివి అనే కంటెస్టెంట్ అసలు బిగ్‌బాస్‌లో ఉందా లేదా అనే అనుమానం వస్తుంది. ఇప్పటికి మూడు రోజులు అవుతున్నా కూడా ఒక్కటంటే ఒక్క మాట కూడా వినిపించలేదు. కనీసం ఓ నిమిషం పాటు కనిపించలేదు. ఎన్ని గొడవలు, ఎంత అరుపులు, ఏడుపులు వినిపిస్తున్నా దివి మాత్రం నోరు మెదపలేదు. అప్పుడప్పుడు మెరుపు తీగలా కనిపించి వెళ్లిపోయినట్టుంది.
రెండో రోజు అభిజీత్-కరాటే కళ్యాణి మధ్య గొడవ జరగడం, కిచెన్ దగ్గరి ఇద్దరూ మళ్లీ కలిసిపోయేందుకు మాట్లాడుకోవడం జరిగింది. ఆ సమయంలో దివి అక్కడే ఉంది కానీ ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తన పనేదో తాను చేసుకుంటూ పోయింది. ఇక మరో సారి కరాటే కళ్యాణి డిస్కషన్ పెడుతుండటం చూసి అక్కడి వరకు వచ్చి వెంటనే వెనుదిరిగి వెళ్లిపోయింది. అప్పడు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ మరింతగా వర్కౌట్ అయింది.
ఇక నామినేషన్ ప్రక్రియలో భాగంగా కరాటే కళ్యాణి మాట్లాడిన మాటలు, పలికిన ప్రగల్భాలకు హౌస్‌మేట్స్ బిత్తర పోయారు. అభిజీత్ ఏకంగా తల పట్టుకుని ఏంట్రా మాకు ఇది అన్నట్టు ఎక్స్‌ప్రెషన్ పెట్టేశాడు. అదే సమయంలో దివి సైతం ఓ సెటైరికల్ చూపు చూసేసింది. ఇలా చూపులు తప్పా ఒక్కసారైనా దివి మాటలు వినకపోతామా? కళ్లారా చూసుకునేందుకు కనబడకుండా ఉంటుందా? అని బిగ్‌బాస్ ఫ్యాన్స్, దివి అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇక మూడో రోజు అయినా దివి కనిపిస్తుందని, ఏదైనా మాట్లాడుతుందేమో అని అందరూ ఎదురుచూశారు. కానీ ఏ ఒక్క చోట కూడా దివి కనిపించలేదు. వినిపించలేదు. ఈ విషయమై సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. వెళ్లేలోపు కనీసం ఒక్కసారైనా ఆమె గొంతు వినాలని ఉందని సెటైర్ వేస్తున్నారు.