భోళా బాక్సాఫీస్.. ఇక మిగిలింది ఒక్క రోజే

మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఎలాంటి టాక్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా కమర్షియల్ గా ఎంతో కొంత సక్సెస్ అవుతుందని మెగాస్టార్ రిస్క్ చేసి మరీ చేశారు. ఇక నిర్మాత అనిల్ సుంకర బడ్జెట్ విషయంలో కూడా పెద్దగా కాంప్రమైజ్ కాకుండానే గట్టిగానే ఖర్చు చేశారు.

కానీ సినిమా వారి అంచనాలను ఒక్కసారిగా తలకిందులు చేసింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ నష్టాలను కలుగజేసే విధంగా ముందుకు కొనసాగుతోంది. శనివారం కంటే ఆదివారం రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాస్త కలెక్షన్స్ అయితే పెరిగాయి. కానీ అవి ఏమి నష్టాలను తగ్గించేంత నెంబర్స్ ఏమీ కావు.

మొత్తంగా మూడు రోజుల్లో ఇప్పటివరకు భోళాశంకర్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 21 కోట్ల షేర్ కలెక్షన్స్ 32 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని అటువైపు నుంచి 1.50 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఓవర్సీస్ లో ఇప్పటివరకు కేవలం రెండు కోట్ల రేంజ్ లోనే షేర్ కలెక్షన్స్ వచ్చాయి.

ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా 25 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ 40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఇక సినిమా థియేట్రికల్ బిజినెస్ 79 కోట్లు కాగా 80 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ సెట్ అయింది. అంటే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మరో 55 కోట్ల షేర్ కలెక్షన్స్ వెనక్కి తీసుకు రావాల్సి ఉంది. కానీ సోమవారం రోజు కలెక్షన్స్ పెరగకపోవచ్చు. ఇక మంగళవారం రోజు ఆగస్టు 15 హాలిడే కావడంతో ఆ ఒక్కరోజే ఎంతో కొంత వెనక్కి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరి ఈ ఒక్క రోజును భోళా ఎలా వాడుకుంటాడో చూడాలి.