ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా పరిశ్రమపై వేసిన విమర్శల తూటాలు ఇప్పుడు టాలీవుడ్‌ను షేక్ చేస్తున్నాయి. పవన్ ఇటీవల రాసిన ఘాటు లేఖ, థియేటర్ల బంద్ అంశంపై ఆయన గళమెత్తిన తీరు, సినీ ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇప్పటికే బన్నీ వాసు, నాగ వంశీ వంటి నిర్మాతలు ఐక్యత లోపం, సందిగ్ధతపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తుండగా, తాజాగా బండ్ల గణేష్ కూడా పవన్ మద్దతుగా వేదికపైకి దిగారు.
గణేష్ శనివారం రాత్రి ట్విట్టర్‌లో ఒక ఫోటోతో పాటు, “సింహాన్ని దూరంగా చూడండి తప్పు లేదు. దగ్గరకు వెళ్లి కెలికితే మీ ఇష్టం” అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికే దారితీశాయి. ఆయన వ్యాఖ్యలు పవన్‌కు వ్యతిరేకంగా ఉన్న సినీ పెద్దలకే సూచించారన్నదే టాక్. పవన్ అభిమానిగా గణేష్ గతంలోనూ అనేకసార్లు స్టేట్‌మెంట్‌లు ఇచ్చినప్పటికీ, ఈసారి ఆయన కామెంట్లు మరింత గంభీరంగా మారాయి.
ఇక పవన్ లేఖ నేపథ్యంలో, ఆయన హరిహర వీరమల్లు విడుదలకు ముందే థియేటర్లను బంద్ చేయాలన్న డిమాండ్ మరింత వివాదాస్పదమైంది. ఈ రెండు అంశాలను కలిపి చూస్తే, పవన్ సినిమాకు అడ్డుకట్ట వేయడానికే ప్రయత్నమా? అనే అనుమానాలు అభిమానుల్లో ఊపందుకున్నాయి. దీంతో గణేష్ వ్యాఖ్యలు అభిమాన వర్గాల్లో హైప్‌ను మరింత పెంచాయి.
ఇక ఇప్పుడు సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ నిర్మాతలు కొందరు ఇప్పటికీ స్పందించకపోవడం గమనార్హం. ఇండస్ట్రీకి మద్దతుగా నిలవాల్సిన సమయంలో నిశ్శబ్దం పాటించడం పలు వర్గాల్లో అసహనానికి దారితీస్తోంది. బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు, పవన్ స్థాయి నాయకుడికి పెట్టిన మద్దతు ఈ చర్చను మరింత మలుపు తిప్పే అవకాశముంది.