బాలకృష్ణ ,బోయపాటి తాజా చిత్రానికి టైటిల్ ఫిక్స్ !

బాలకృష్ణ నుంచి ఓ సినిమా వస్తోందంటే అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అందులోనూ బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్నాడంటే ఇక ఆ చిత్రానికి వుండే క్రేజ్ చెప్పేక్కర్లేదు. గతంలో వీరి కలయికలో వచ్చిన రెండు చిత్రాలూ బాక్సాఫీసు వద్ద భారీ హిట్సుగా నిలిచాయి. ఈ క్రమంలో వీరి కలయికలో వస్తున్న మూడవ చిత్రం (బీబీ3)పై అంతకుమించిన అంచనాలు వున్నాయి.

ఇక ఈ సినిమా టైటిల్ గురించి మొదటి నుంచీ రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, అవేవీ ఖరారు కాలేదని దర్శక నిర్మాతలు ఎప్పటికప్పుడు ప్రకటించారు కూడా. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రానికి ‘గాడ్ ఫాదర్’ అనే పవర్ ఫుల్ టైటిల్ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. కథకు, బాలయ్య పాత్ర తీరుతెన్నులకు ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారట. అందుకే, దీనిని ఖరారు చేసినట్టు, త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం.

ఈ చిత్రంలో బాలకృష్ణ అఘోరా పాత్రలో కూడా కనిపిస్తారని, ఆ గెటప్ సినిమాకి హైలైట్ అవుతుందని అంటున్నారు. అలాగే, బోయపాటి బ్రాండ్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయట. ఎన్టీఆర్ జన్మదినమైన మే 28న విడుదల కానున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.