సామాజిక మాధ్యమాల్లో ‘అకాయ్’ అనే ఈ పేరు వైరల్ అవుతోంది. ఇది ఎవరి పేరో కాదు, ప్రముఖ క్రికెట్ ఆటగాడు విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులకు పుట్టిన కుమారుడి పేరు ‘అకాయ్’ అని పేరు పెట్టారు. వారిద్దరికీ ఇది రెండవ సంతానం, ఇంతకు ముందు వారికి ఒక పాప, ఆమె పేరు వామిక.
తమకి ఫిబ్రవరి 15న బాబు పుట్టాడని, అతనికి అకాయ్ అని పేరు పెట్టామని, ఆ బాబుకి అందరి ఆశీర్వాదాలు కావాలని సామాజిక మాధ్యమం ద్వారా వారిద్దరూ చెప్పారు. అయితే తమ ప్రైవేట్ లైఫ్ కి ఎవరూ భంగం కలిగించకూడదు అని కూడా ఈ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఇంతకీ అకాయ్ అంటే అర్థం ఏమిటి అనేది చాలామందికి కలిగే ప్రశ్న.
ఎవరికీ వారు ఆ పదానికి అర్థం ఏమిటనేది వెతుకుతూనే వున్నారు. కొందరు అకాయ్ అంటే శరీరంలేనివాడు అని అర్థం వస్తుందని అంటున్నారు. అలాగే టర్కీ భాషలో ‘అకాయ్’ అంటే ప్రకాశించే చంద్రుడు అని కూడా అర్థం ఉందని అంటున్నారు. అందుకే తమ కుమారుడికి ఈ పేరు పెట్టారని కూడా కొందరి చర్చ. ఇక సంస్కృతంలో ఈ ‘అకాయ్’ అంటే అమరుడు, చిరంజీవి అని కూడా అర్ధం వుంది అని అంటున్నారు.
అకాయ్ అంటే అపరిమిత శక్తి అని కూడా ఒక అర్థం వుంది అంటున్నారు. అలాగే అకాయ్ పేరులో అనుష్కాలోని ‘అ’, కోహ్లి నుంచి ‘క’ తీసుకున్నారు అని కూడా ఒక వాదన వినిపిస్తోంది. అయితే 2021లో వీరికి పుట్టిన పాపకి వామిక అని పేరు పెట్టారు, ఆ పేరుకి అర్థం దుర్గామాత అని. ఇప్పుడు 2024లో అకాయ్ పుట్టాడు, అర్థం అందరూ వెతుకుతున్నారు. కానీ ఈ పేరు తామెందుకు పెట్టామో వారే తరువాత వివరణ ఇస్తారేమో చూడాలి. అనుష్క, విరాట్ ల వివాహం 2017లో జరిగిన విషయం విదితమే…!