Anushka: రాజమౌళి ఆహ్వానం మేరకు RRR పార్టీలో సందడి చేసిన అనుష్క..!

Anushka: బాహుబలితో పాన్ ఇండియా డైరెక్ట‌ర్‌గా మారి తెలుగు సినిమా స‌త్తాను ప్ర‌పంచానికి చాటిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి . ఆయన దర్శకత్వంలో తాజాగా రిలీజైన చిత్రం ఆర్‌ఆర్ఆర్ గురించి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే అంతులేని ఆదరాభిమానాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తోంది. ఈ సినిమాకు దేశంలోనే కాకుండా అమెరికా లాంటి అగ్ర దేశాల్లోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఏర్పడింది. రిలీజ్ అవుతుందన్న మొదటి రోజు ఉదయం నుంచే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.

అయితే ఇంతటి భారీ స్థాయిలో అంతులేని రెస్పాన్స్‌ను అందుకోవడం పట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. మూవీ మేకర్స్ సైతం ఈ సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ, తమ అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. ఇక అందులో భాగంగానే తాజాగా జరిగిన ఓ పార్టీలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, దిల్ రాజు, ఉపాసన, ప్రణతితో పాటు పలు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొని ఈ సినిమా ఇంతటి విజయం సాధించడం వెనుక ఉన్న కృషిని వారు ప్రశంసించారు. కాగా చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ పార్టీలో ఒక్కసారిగా ఓ స్టార్ హీరోయిన్ తళుక్కుమనడంతో అందరి కళ్లూ ఆమె మీద పడ్డాయి. ఇంతకీ ఆమె ఎవరంటే అనుష్క. చాలా కాలం తర్వాత ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ పార్టీలో ఆమె స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచిందని చెప్పవచ్చు.

ఇక రాజమౌళి ప్రత్యేక ఆహ్వానం మేరకు స్వీటీ, ఈ పార్టీకి వచ్చినట్టు సమాచారం. అందులో భాగంగా అనుష్క, రామ్ చరణ్‌తో మాట్లాడుతుండగా తీసిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిశ్శబ్దం సినిమా తర్వాత మళ్లీ ఏ సినిమాల్లోనూ కనిపించని అనుష్క, ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నట్టు సమాచారం.