Mokshagnya: మోక్షజ్ఞ కోసం మరో క్రేజీ ప్రాజెక్ట్.. ట్రాక్ లోకి లక్కీ డైరెక్టర్!

నందమూరి మోక్షజ్ఞ తన తొలి చిత్రంతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను పెంచింది. అయితే, మొదటి ప్రాజెక్ట్ షూటింగ్ మొదలు కాకముందే, మోక్షజ్ఞ రెండో చిత్రంపై ఆసక్తికర సమాచారం బయటకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. తాజా సమాచారం ప్రకారం, మోక్షజ్ఞ తన రెండో చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో చేయనున్నారు.

ఈ నిర్మాణ సంస్థ ఇప్పటికే “డాకు మహరాజ్” సినిమాతో నందమూరి బాలకృష్ణతో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకుంది. మోక్షజ్ఞ కోసం ప్రత్యేకంగా ఒక కథను రెడీ చేస్తూ, ఈ ప్రాజెక్ట్‌కు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. వెంకీ అట్లూరి ఇటీవలే దుల్కర్ సల్మాన్‌తో “లక్కీ భాస్కర్” వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించారు. ఇప్పుడు, ఆయన మోక్షజ్ఞ కోసం పూర్తిగా వినూత్నమైన పంథాలో కథను రూపొందించారని టాక్.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుందని సమాచారం. కుటుంబ బంధాలు, ప్రేమ, భావోద్వేగాలతో కూడిన కథలపై ప్రత్యేక నైపుణ్యం ఉన్న వెంకీ అట్లూరి, ఈ సినిమాతో మోక్షజ్ఞ టాలెంట్‌ను ప్రదర్శించేందుకు ప్రత్యేకమైన స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండగా, స్క్రిప్ట్ చివరి మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది.

మోక్షజ్ఞకు తగిన స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలని, కథానాయకుడిగా నిలదొక్కుకునేలా చేయాలని బాలయ్య ప్రత్యేక దృష్టి పెట్టారు. మొదటి చిత్రంలో సైన్స్ ఫిక్షన్ తరహా కథతో ప్రశాంత్ వర్మను ఎంచుకోగా, రెండో చిత్రానికి ఎమోషనల్ కాన్సెప్ట్‌ను వెంకీ అట్లూరి ఆధ్వర్యంలో మలచుతున్నారు. ఇది మోక్షజ్ఞ కెరీర్‌కు పటిష్టమైన బేస్ ఏర్పరచేందుకు పర్ఫెక్ట్ ప్లాన్. మోక్షజ్ఞ ప్రాజెక్ట్‌లు ఒక్కొక్కటిగా ఫైనలైజ్ అవుతుండటంతో నందమూరి అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఈ రెండో ప్రాజెక్ట్ పైన వచ్చే అధికారిక ప్రకటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.