‘అంబాజీపేట మ్యారేజ్‌ బాండ్‌’ విజయం .. సక్సెస్‌ హీరోగా సుహాస్‌ !

ఇటీవలే విడుదలైన ‘అంబాజీ పేట మ్యారేజ్‌ బ్యాండ్‌’ సినిమా మంచి టాక్‌ ని సొంతం చేసుకోవడమే కాకుండా, బాక్స్‌ ఆఫీస్‌ దగ్గర కూడా వసూళ్లు బాగానే రాబట్టింది. దర్శకుడు దుష్యంత్‌ ఈ సినిమా కథ ఒక యదార్ధ సంఘటన ఆధారంగా రాసుకున్నది. ఇందులో నటించిన శరణ్య ప్రభాకర్‌, సుహాస్‌ లకు మంచి పేరు తీసుకురావటమే కాకుండా, సుహాస్‌ కి కథానాయకుడిగా ఈ సినిమా వరసగా మూడో విజయాన్ని అందించింది.

సుహాస్‌ ఇంతకు ముందు ‘కలర్‌ ఫోటో’ అనే సినిమాలో కథానాయకుడిగా నటించగా ఆ సినిమా ఓటిటి లో విడుదలైంది. అయితే ఆ సినిమా జాతీయ అవార్డు గెలుచుకుంది. ఆ తరువాత ‘రైటర్‌ పద్మభూషణ్‌’ లో కథానాయకుడిగా చేసిన సుహాస్‌ కి ఆ సినిమా అటు మంచి పేరుతో పాటు, డబ్బులు కూడా తెచ్చింది, అది రెండో విజయం.

ఇప్పుడు మూడో సినిమా’అంబాజీ పేట మ్యారేజ్‌ బ్యాండ్‌’ చేసాడు, ఇది ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ అయింది, మంచి విజయం సాధించింది.సుహాస్‌ కథానాయకుడిగా వైవిధ్యమైన కథలు ఎంచుకుంటున్నాడు, ఎదో పాటలు, లేదా వాణిజ్యపరమైన విలువలు ఉండాలి అన్నట్టుగా కాకుండా, సినిమాకి కథ ముఖ్యం, అందుకని తన ప్రతిభ చూపించుకోవడానికే వుండే విధంగా కథలని ఎంచుకుంటున్నాడు.

ఇప్పుడు విజయవంతమైన ఈ మూడు సినిమాలు కూడా ఒకదానితో ఒకటి పోలిక లేకుండా ఉండేవే. సుహాస్‌ చేతిలో ఇంకా అరడజను చిత్రాలు వున్నాయి, కొత్తవాళ్లు కథలు చెప్తున్నారు, వింటున్నాడు కూడా. చిన్న నిర్మాతలకి, కొత్త దర్శకులకి సుహాస్‌ వున్నాడు అన్న భరోసా కల్పిస్తున్నాడు.