టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్‌కు కేరళలో భారీ ఫాలోయింగ్ ఉందని అందరికీ తెలుసు. ‘హ్యాపీ’ వంటి ఫ్లాప్ సినిమాను మలయాళంలో సూపర్ హిట్ చేసి అతడు అక్కడ ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఆ తర్వాత ‘ఆర్య’, ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’, ‘అల వైకుంఠపురములో’ వంటి సినిమాలు కేరళలో ఘన విజయాలను అందించాయి. ‘పుష్ప’ కూడా మలయాళంలో ఊహించని స్థాయిలో హిట్ అయింది. దీంతో ‘పుష్ప-2’పై అక్కడి ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే, ‘పుష్ప-2’ సినిమా మలయాళ మార్కెట్‌లో ఆశించినంత ప్రభావం చూపలేదు. ఫస్ట్ డే పది కోట్ల గ్రాస్ టార్గెట్‌గా భావించగా, కేవలం రూ.6 కోట్ల వసూళ్లకే పరిమితమైంది. రెండో రోజుకు ఆ సంఖ్య సగానికి తగ్గిపోయింది. తెలుగు, హిందీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మించిన మాస్ కంటెంట్ కేరళ ఆడియన్స్‌కు పూర్తిగా కనెక్ట్ కాలేదనే విషయం స్పష్టమవుతోంది.
మలయాళ ఆడియన్స్ సున్నితమైన కథలకు, నేచురల్ పెర్ఫార్మెన్సులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ ‘పుష్ప-2’ మాస్ యాక్షన్ డోస్ అధికంగా ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. అలాగే, ఫాహద్ ఫాజిల్ పాత్రను ప్రెజెంట్ చేసిన విధానం కూడా అక్కడి ప్రేక్షకుల మనసును దోచుకోలేకపోయింది. ఈ కారణాల వల్ల మలయాళ మార్కెట్‌లో ‘పుష్ప-2’కు అనుకున్న స్థాయిలో వసూళ్లు రావడం కష్టమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
‘లియో’ వంటి పెద్ద సినిమా కేరళలో రూ.60 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించగా, ఇక ‘పుష్ప-2’ అందులో సగం అయినా రాబడుతుందా అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. మలయాళ మార్కెట్‌లో ‘పుష్ప-2’ కలెక్షన్లు అనుకున్న స్థాయిలో రాకపోవడం, ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన రావడం అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తోంది.