జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న అల్లు అర్జున్!

69వ జాతీయ చలన చిత్ర పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీ వేదికగా అట్టహాసంగాజరిగింది. అవార్డులు అందుకోబోయే వారంతా సోమవారమే ఢిల్లీకి చేరుకున్నారు. జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన ‘ఉప్పెన’ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాతలు నవీన యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌, దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌, నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతులమీదుగా జాతీయ పురస్కారాల్ని అందుకున్నారు.

వేడుక ప్రారంభానికి ముందు అల్లు అర్జున అక్కడి మీడియాతో మాట్లాడారు. తొలిసారి నేషనల్‌ అవార్డ్‌ అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కమర్షియల్‌ చిత్రానికి (పుష్ప) జాతీయ అవార్డు రావడమనేది డబుల్‌ అఛీవ్‌మెంట్‌ అని పేర్కొన్నారు. ‘పుష్ప’లోని తగ్గేదేలే డైలాగ్‌ చెప్పి అలరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

కాగా.. ఆగస్ట్‌లో జాతీయ పురస్కారాల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్‌ చరిత్ర సృష్టించారు. టాలీవుడ్‌ చరిత్రలో ఎందరో గొప్ప నటులు ఉన్నా ఎవరికీ దక్కని అవకాశం అల్లు అర్జునకి దక్కింది.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి ఆరు పురస్కారాలు లభించగా, ‘పుష్ప: ది రైజ్‌’ చిత్రానికి రెండు దక్కాయి. ‘ఉప్పెన’ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ‘కొండపొలం’ సినిమాలోని ‘ధమ్‌ ధమ్‌ ధమ్‌..’ పాటకు చంద్రబోస్‌కు ఉత్తమ గీత రచయితగా అవార్డు దక్కింది.