తెలుగు, తమిళ పరిశ్రమలో ఎవరూ ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకున్న చిత్రం గజిని. సూర్య కెరీర్‌కు యూ టర్న్ ఇచ్చిన ఈ చిత్రం, హిందీలో అమీర్ ఖాన్ నటించిన రీమేక్ ద్వారా మరింత క్రేజ్ పొందింది. దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టిన ఈ సినిమా, ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో స్థిరపడిపోయిన బ్లాక్‌బస్టర్. అయితే ఇప్పుడు గజిని 2 గురించి మరోసారి చర్చ మొదలైంది.
హిందీ రీమేక్‌ను నిర్మించిన అల్లు అరవింద్ ఇటీవల ముంబైలో జరిగిన తండేల్ ట్రైలర్ ఈవెంట్‌లో గజిని 2 గురించి ప్రస్తావించడంతో, ఈ వార్త వైరల్ అయింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన అమీర్ ఖాన్ కూడా సీక్వెల్ గురించి ఆసక్తిగా మాట్లాడారు. అయితే, ఈ సీక్వెల్‌పై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. పైగా, ఇలాంటి క్లాసిక్ సినిమాలకు సీక్వెల్ చేయడం ఎంతవరకు అవసరమన్నదానిపై అనేక సందేహాలు ఉన్నాయి.
సీక్వెల్ అనేది సాధారణంగా మొదటి భాగం విజయం సాధించిన వెంటనే ప్లాన్ చేస్తే వర్కౌట్ అవుతుంది. కానీ గజిని విడుదలై ఇప్పటికే రెండు దశాబ్దాలు పూర్తయిపోయాయి. ఈ గ్యాప్‌లో ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయి. తాజా ఉదాహరణగా భారతీయుడు 2 ను తీసుకుంటే, శంకర్ క్లాసిక్ సినిమాకు కొనసాగింపుగా తీసిన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా, కమల్ హాసన్ అభిమానులే అసంతృప్తిగా స్పందించారు.
మరోవైపు, దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో లేడనే చెప్పాలి. ఆయన సౌత్‌లో గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద హిట్ కొట్టలేకపోయారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో సికందర్ చేస్తున్నప్పటికీ, ఈ ప్రాజెక్ట్ ఎలా ఆవిష్కృతమవుతుందో తెలియదు. అలాంటి పరిస్థితిలో గజిని 2 చేయడం రిస్క్‌గానే అనిపిస్తోంది. సినిమా కథను కొత్త తరహాలో అద్భుతంగా మలచకపోతే, ఇది గజిని బ్రాండ్‌కి నష్టం కలిగించే అవకాశం ఉంది. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాలు తక్కువ గ్యాప్‌లో సీక్వెల్‌లు తీసుకురావడం వల్లే సక్సెస్ అయ్యాయి. కానీ ఇన్నేళ్ల తర్వాత ఒక లెజెండరీ సినిమాకు కొనసాగింపు చేయడం ఎంతవరకు లాభదాయకమో ఆలోచించాల్సిన విషయం.