బాలీవుడ్ అగ్ర కథానాయిక అలియా భట్ నటించిన రీసెంట్ సూపర్ హిట్ చిత్రం ‘జిగ్రా’. ఈ సినిమాకు వసన్ బాల దర్శకత్వం వహించగా.. ధర్మ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, అలియా భట్, షాహీన్ భట్ సోమెన్ మిశ్రా సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.
ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ను పంచుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం డిసెంబర్ 06 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో అలియా భట్ అక్కగా నటించగా.. వేదాంగ్ రైనా తమ్ముడి పాత్రలో నటించాడు. టాలీవుడ్ నటుడు రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలో మెరిశాడు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తమ చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన సత్యభామ ఆనంద్ (అలియా భట్) తమ్ముడికి (వేదాంగ్ రైనా) అన్ని తానై పెంచుతుంది.
అయితే ఒక బిజినెస్ పని మీద హన్షదావో అనే దీవికి వెళతాడు అంకుర్. ఈ క్రమంలోనే అతడి చేయని తప్పుకు డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటాడు. అయితే డ్రగ్స్ వాడినందుకు కోర్టు అంకుర్‌కు మరణశిక్ష విధిస్తుంది. ఈ విషయం సత్యభామకి తెలియడంతో తన తమ్ముడిని కాపాడుకునేందుకు హాన్షదావోకి వెళుతుంది. అయితే సత్య అక్కిడికి వెళ్లాక ఆమెకు ఎదురైన పరిస్థితులేంటి? తన తమ్ముడిని మరణశిక్ష నుంచి తప్పింది బయటకు తీసుకువచ్చిందా.. అసలు అంకుర్ డ్రగ్స్ కేసులో ఎలా ఇరుక్కున్నాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.