శ్యామ్ బాబు కాదు, ఈసారి ‘కామ్’ బాబు.!

‘బ్రో’ సినిమాలో పృధ్వీ పోషించిన శ్యామ్ బాబు పాత్రకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. వాస్తవానికి ఆ పాత్రకు సినిమాలో అస్సలేమాత్రం ప్రాధాన్యత లేదు. కానీ, పొలిటికల్ యాగీ వల్ల ఆ పాత్రకు ఎక్కడ లేని రెస్పాన్స్ వచ్చేసింది. కేవలం 1 నిముషం 25 సెకన్ల పాటే కనిపించిన ఈ పాత్రతో ఇప్పుడు ఏకంగా ఫుల్ లెంగ్త్ సినిమా తీసేంతలా ఈ పాత్ర ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే అర్ధం చేసుకోవచ్చు ఆ పాత్ర ప్రాధాన్యత ఏంటో.

శ్యామ్ బాబు పాత్రలో కనిపించిన పృద్వీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్. ఈ పాపులారిటీని క్యాష్ చేసుకునేందుకు ఓ పాపులర్ నిర్మాత, ప్రముఖ దర్శకుడు ముందుకొచ్చారట. శ్యామ్ బాబు పాత్రతో ఫుల్ లెంగ్త్ మూవీకి రంగం సిద్ధం చేస్తున్నారట.

అయితే, నిజంగానే ఈ పాపులారిటీని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారో, లేక మరేదైనా కారణం కావచ్చో తెలీదు కానీ, ఈ సారి శ్యామ్ బాబుని కాస్తా ‘కామ్’ బాబుగా మరింత శక్తివంతంగా తీసుకురాబోతున్నారట. ఈ సినిమాలో శ్యామ్ బాబు పాత్ర డ్యూయల్ రోల్ అనీ తెలుస్తోంది.

ఒకటి శ్యామ్ బాబు పేరుతోనూ ఇంకోటి కామ్ బాబు పేరుతోనూ వుండబోతున్నాయట. పాపులారిటీ తెచ్చుకున్న పృద్వీనే ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఈ ప్రాజెక్ట్ ఖాయమైనట్లేనట. వీలైనంత ఎర్లీగా షూటింగ్ పూర్తి చేసి, ఫిబ్రవరి, మార్చికల్లా విడుదల చేసే యోచనలో వున్నారట.