బిల్లా షూటింగ్ సమయంలో యూనిట్ మొత్తానికి వంట వండిన జూ ఎన్టీఆర్ !

కృష్ణంరాజు సినీ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్ ఈశ్వర్ సినిమా ద్వారా హీరోగా మారాడు. ఆ తర్వాత టాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. ఇలా వర్షం చత్రపతి బిల్లా బాహుబలి వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించిన ప్రభాస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.

ఇదిలా ఉండగా ప్రభాస్ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోలతో మంచి అనుబంధము ఉంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తో ప్రభాస్ కి ఎంతో అనుబంధం ఉందని ఇటీవల దర్శకుడు మెహర్ రమేష్ వెల్లడించాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం బిల్లా. కృష్ణంరాజు సొంత బ్యానర్ గోపికృష్ణ మూవీస్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. ఇక ఈ సినిమాలో కృష్ణంరాజు కూడా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఇదిలా ఉండగా ఇటీవల ‘బిల్లా’ సినిమా 4K టెక్నాలజీలో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మెహర్ రమేష్, అలీ, కృష్ణంరాజు పెద్ద కుమార్తెతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ సినిమా విశేషాలతోపాటు ప్రభాస్ ఎన్టీఆర్ మధ్య ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ క్రమంలో మెహర్ రమేష్ మాట్లాడుతూ… బిల్లా సినిమా ఎయిర్ పోర్ట్ లో షూటింగ్ చేస్తున్న సమయంలో దూరం నుండి ఒక వ్యక్తి కెమెరా వైపు నడుచుకుంటు వస్తున్నాడు. ఎన్ని భాషలలో చెప్పినా కూడా ఆ వ్యక్తి ఆగకుండా నేరుగా కెమెరా వైపు వస్తున్నాడు. తీరా దగ్గరికి వచ్చి చూడగా అక్కడ జూనియర్ ఎన్టీఆర్ కనిపించగానే అందరూ ఆశ్చర్యపోయారు. అలా బిల్లా షూటింగ్ లోకేషన్ కి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ యూనిట్ సభ్యులందరికీ స్వయంగా వంట వండి పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ మధ్య ఎంతో మంచి అనుబంధము ఉంది. కేవలం షూటింగ్ చూడటానికి వచ్చిన ఎన్టీఆర్ అందరికీ వంట చేసి పెట్టి అందరితో ఎంతో సంతోషంగా గడిపినట్లు దర్శకుడు చెప్పుకొచ్చాడు.