ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. దీంతో సరికొత్త టెక్నాలజీ ఉపయోగించి వాహనాల తయారీలో అనేక మార్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలను కూడా తయారు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు రోజురోజుకి పెరిగిపోవడం, అలాగే వాతావరణ కాలుష్యం కూడా అధికమవడం వల్ల ఈ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ వాహనాలు ధర కూడా తక్కువగా ఉండటంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనటానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు .
ఇంధనం అవసరం లేకుండా విద్యుత్ తో దూసుకెళ్లే ఈ- బైక్స్, కార్లు, బస్సులు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాలకు చెందిన మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు (ఎంఈఐఎల్) చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ ట్రక్ (E-Tipper) ను ఆవిష్కరించింది. ఈ ట్రక్ బ్యాటరీని ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసేలా కంపెనీ ఈ ట్రక్ ని రూపొందించింది. ఇటీవల బెంగుళూరు వేదికగా జరిగిన ఇండియా ఎనర్జీ వీక్-2023లో ప్రదర్శనకు ఉంచిన ఈ ఎలక్ట్రిక్ ట్రక్ అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ ఎలక్ట్రిక్ ట్రక్ ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.అధునాతన టెక్నాలజీతో ఉపయోగించి తయారుచేసిన ఈ ఎలక్ట్రిక్ ట్రక్ లో పొందుపరిచిన బ్యాటరీ రెండు గంటల్లోనే వంద శాతం చార్జ్ అవుతుంది. ఇక ఇటీవల ఈ-ట్రక్ పనితీరు తెలుసుకోవడానికి కంపెనీ 2022 ఏప్రిల్‌లో ట్రయల్స్ ప్రారంభించింది. ట్రయల్స్ అన్నీ విజయవంతం కావడంతో ఈ ఎలెక్ట్రిక్ ట్రక్ ను మార్కెట్ లోకి ప్రవేశ పెట్టేందుకు ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ సిధ్ధంగా ఉంది. తొందర్లోనే ఈ ఎలక్ట్రిక్ ట్రక్ లు మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి.