Auto Driver: పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించాడో ఆటో డ్రైవర్. తాను ఎదొర్కొన్న అవమానాలతో గెలుపు బాట వేసుకున్నాడు. నవ్విన వారే ఆశ్చర్యపోయేలా ఎదిగాడు. పదో తరగతి ఫెయిలై ఇండియాలో ఆటో డ్రైవర్ గా జీవిస్తున్న అతని జీవితం అనూహ్య మలుపులు తిరిగింది. ప్రస్తుతం ఆ యువకుడు స్విట్జర్లాండ్ లో ప్రముఖ యూట్యూబర్. రాజస్థాన్ ఆటో డ్రైవర్ స్విట్జర్లాండ్ లో సెటిలయ్యే వరకూ ఎలా వెళ్లిందో తెలుసుకుందాం..
పట్టుదలే సోపానం..
రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన రంజిత్ సింగ్ పేదరికం కారణంగా పెద్దగా చదువుకోలేదు. పది ఫెయిలై కుటుంబ పోషణ కోసం 16 ఏళ్ల వయసులోనే ఆటో డ్రైవర్ గా మారాడు. అయితే.. జైపూర్ కు ఫారిన్ విజిటర్స్ ఎక్కువ. దీంతో చాలామంది ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకుని టూరిస్టులకు గైడ్ గా ఉంటారు. కానీ.. రంజిత్ కు ఇవేమీ రావు. పైగా.. పెద్దగా ఆకర్షణీయ రూపం కూడా లేకపోవడంతో అతడి ఆటో ఎక్కేవారు కాదు. దీంతో అతనిలో పట్టుదల పెరిగింది. ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్ భాషలు నేర్చుకున్నాడు. కొద్దిగా స్టైల్ మార్చి ఆటో డ్రైవింగ్ తోపాటు సొంతంగా టూరిస్ట్ బిజినెస్ ప్రారంభించాడు. తన మాట తీరు, ఆహార్యంతో టూరిస్టులను ఆకర్షించాడు. దీంతో బిజినెస్ పెరిగింది. సంపాదన కూడా పెరిగింది. అయితే.. ఈక్రమంలో తన జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన జరిగింది.
ప్రేమ రూపంలో అదృష్టం..
ఫ్రాన్స్ నుంచి జైపూర్ కు టూరిస్టుగా వచ్చిన ఓ యువతి అతడి జీవితాన్నే మార్చేసింది. ఆమె రంజిత్ తో ప్రేమలో పడింది. ఆమె ప్రపోజ్ చేయడంతో రంజిత్ కూడా ఆమెను ఇష్టపడ్డాడు. ఆమె ఫ్రాన్స్ వెళ్లాక కూడా వీరి ప్రేమ కంటిన్యూ అయింది. దీంతో పెళ్లి చేసుకోవాలని భావించారు. ప్రేయసి కలిసేందుకు ఫ్రాన్స్ వెళ్లాలనుకున్న రంజిత్ ప్రయత్నాలు వీసా నిబంధనలు అడ్డు పడ్డాయి. ఫ్రాన్స్ ఎంబసీ ఎన్నోసార్లు రంజిత్ వీసా దరఖాస్తును రిజెక్ట్ చేసింది కూడా. దీంతో ఆమె స్వయంగా భారత్ వచ్చి వీసా సమస్యను పరిష్కరించి రంజిత్ ను తనతోపాటు ఫ్రాన్స్ తీసుకెళ్లింది. అలా.. 2014లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం లాంగ్ టర్మ్ వీసాకు దరఖాస్తు కూడా చేసుకున్నాడు. అయితే.. రంజిత్ కు ఫ్రాన్స్ ఫుడ్ పడలేదు. అక్కడి ఫుడ్, ప్రజల అలవాట్లు వేరు. దీంతో తన ఆహారాన్ని తానే వండుకోవడం మొదలుపెట్టాడు.
ఫేమస్ యూట్యూబర్ గా..
తాను చేస్తున్న వంటలను యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం ప్రారంభించాడు. ఆ వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కొన్నాళ్ల తర్వాత స్విట్జర్లాండ్ లోని జెనీవాలో స్థిరపడ్డారు. అక్కడా రంజిత్ వంటలు చేస్తూ.. వీడియోలను అప్లోడ్ చేసేవాడు. పైగా.. లోకల్ గా వంటలు నేర్పించడం మొదలుపెట్టాడు. ఈ వీడియోస్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీంతో అతను యూట్యూబర్ గా పాపులర్ అయ్యాడు. తనకంటూ ఇదొక వ్యాపకంగా మార్చుకున్నాడు. ప్రస్తుతం వచ్చిన పాపులారిటీతో సొంతంగా ఓ రెస్టారెంట్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇదంతా తన కష్టంతో సాధించుకున్నదే. ఆ యువతి ప్రేమ రంజిత్ కు కలిసొచ్చింది. కష్టానికి అదృష్టం తోడైతే జీవితంలో ఎలాంటి ఎదుగుదల ఉంటుందో రంజిత్ నిరూపించాడు.