ప్రధానమంత్రి సూర్యోదయ స్కీమ్ గురించి తెలుసా.. ఈ స్కీమ్ వల్ల ఇన్ని ప్రయోజనాలా?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అన్ని వర్గాల ప్రజలకు బెనిఫిట్ కలిగేలా ఎన్నో కొత్త స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ప్రధానమంత్రి సూర్యోదయ పథకం పేరుతో మోదీ సర్కార్ ఒక కొత్త స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. భారత్ లో బొగ్గు ఉత్పత్తి పెరుగుతున్నా అదే సమయంలో ప్రత్యామ్నాయ ఇంధనాలకు ప్రాధాన్యత పెరుగుతోంది.

2030 సంవత్సరం నాటికి పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 550 గిగావాట్ల విద్యుదుత్పాదన సామర్థ్యం సాధించాలని భారత్ ఆకాంక్షిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో స్థాపిత విద్యుత్ ఉత్పాదన సామర్థ్యంలో 30 శాతం వాటా పునరుత్పాదక ఇంధన వనరులదే కావడం గమనార్హం. 2024 తాత్కాలిక బడ్జెట్ లో భాగంగా సౌర విద్యుత్ ఉత్పాదనను పెంచడానికి ప్రధానమంత్రి సూర్యోదయ స్కీమ్ ను ప్రకటించడం జరిగింది.

దేశమంతా కోటి కుటుంబాల ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాలను అమర్చడం ద్వారా సౌర విద్యుత్ ఉత్పాదన చేయడం ఈ పథకం లక్ష్యం కాగా ఈ స్కీమ్ ద్వారా ప్రజలు నెలకు ఫ్రీగా 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ను పొందవచ్చు. మిగులు ఉత్పత్తిని గ్రిడ్ కు విక్రయించే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది. ఈ స్కీమ్ ద్వారా కుటుంబానికి ఏడాదికి 18000 రూపాయలు ఆదా అయ్యే అవకాశాలు ఉంటాయి.

ఈ స్కీమ్ వల్ల సౌర ఫలకాలతో విద్యుత్ ఉత్పాదన చేపట్టడం వల్ల కుటుంబాలకు విద్యుత్ బిల్లులు ఆదా అయ్యే అవకాశంతో పాటు శిలాజ ఇంధనాలపై ఆధారపడాల్సిన అవసరం తప్పుతుందని తెలుస్తోంది. ఈ స్కీమ్ సక్సెస్ అయితే పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంలో ప్రపంచంలోనే భారత్ అగ్రగామిగా నిలిచే అవకాశాలు అయితే ఉంటాయి.