ఈమధ్య చాలామందిలో కనపడుతున్న సమస్య కళ్ళ కింద నలుపు. ముఖం అంతా కూడా ముత్యం లాగా మెరుస్తూ ఉంటే కళ్ళ కింద ఉండే నలుపు వల్ల అందహీనంగా కనబడడం చాలా బాధగా ఉంటుంది. ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలం అయి ఉంటాము. అయితే కళ్ళ కింద నలుపు రావడానికి కారణాలు ఏమిటో చూద్దాం.
అతిగా నిద్రపోవడం, విపరీతమైన అలసట, నిద్ర సరిపోకపోవడం. నిద్రలేమి వలన కళ్ళకింద రక్త కణాలలో రక్త ప్రసరణ తక్కువగా జరగడం వల్ల అక్కడ కణజాలాలలో వచ్చే మార్పుతో అవి నల్లగా ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. టీవీ లేదా కంప్యూటర్ ను ఎక్కువగా వాడడం వల్ల కళ్ళు మంటలాగా అనిపించి కళ్ళ కింద నలుపుగా మారడం జరుగుతుంది. శరీరానికి అవసరమైనంత నీరు అందినప్పుడు కూడా ఇలా కళ్ళ కింద నల్ల వలయాలు ఏర్పడే అవకాశం ఉంది.
కళ్ళ కింద నలుపు పోవాలంటే ఐస్ క్యూబ్ ను ఒక శుభ్రమైన బట్ట చుట్టి కళ్ల దగ్గర నలుపు ఉండే భాగంలో ఒక 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి, లేదా ఒక బట్టను చల్లని నీటిలో ముంచి, ఆ బట్టను కళ్ళ కింద పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది.కళ్ళ కింద నలుపు రాకుండా ఉండాలంటే కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల విశ్రాంతి ఇంకా నిద్రను కచ్చితంగా తీసుకోవాలి. అప్పుడు రక్తప్రసరణ బాగా జరిగి నలుపు రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి.
టీ బ్యాగ్ అనేది కూడా కళ్ళ కింద నలుపు పోవడానికి చక్కటి పరిష్కారం. ఇందులో కెఫిన్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి రక్తప్రసరణ ఉత్తేజపరుస్తాయి. బ్లాక్ లేదా గ్రీన్ టీ బాగ్ లను వేడి నీటిలో ఐదు నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత వాటిని ఫ్రిడ్జ్ లో పది నుంచి 15 నిమిషాల వరకు చల్లగా మారేవరకు ఉంచాలి. తర్వాత వాటిని కళ్ళ కింద నలుపు ఉండే ప్రాంతంలో 20 నిమిషాల పాటు ఉంచి, తర్వాత మంచి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి దీని ద్వారా మంచి ఫలితం ఉంటుంది.