చిన్నపిల్లలు నిద్రపోయే విషయంలో తలెత్తే సందేహాలు…. తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

చిన్నపిల్లలు నిద్రపోయే విషయంలో చాలామందికి చాలా రకాల సందేహాలు, అపోహలు ఉన్నాయి. చిన్నపిల్లలు ఎక్కువగా నిద్రపోతే మానసిక శారీరక పెరుగుదల ఉండదని కొందరు చెబుతున్నారు. మరికొందరైతే చిన్నపిల్లలు ఎక్కువగా నిద్రపోతేనే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతుంటారు. అయితే చిన్నపిల్లల వైద్య నిపుణుల ప్రకారం పిల్లల వయస్సు ఆధారంగా నిద్రపోయే సమయాలు కూడా మారుతుంటాయి దానికి అనుగుణంగా పిల్లలను విశ్రాంతి తీసుకోనిస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు.

నిపుణుల సూచనల ప్రకారం పుట్టిన నెల రోజుల్లో చిన్నపిల్లలకు రోజుకు 15 నుంచి 16 గంటల నిద్ర అవసరం.అయితే చిన్నపిల్లలు మధ్య మధ్యలో పాల కోసం ఏడుస్తూ మేల్కొని పాలు తాగిన వెంటనే నిద్రపోతుంటారు. ఒకటి నుంచి నాలుగు నెలల వయసున్న చిన్నారులు రోజుకు 14 నుంచి 15 గంటల నిద్ర అవసరం. ఈ వయసు చిన్నారులు ఎక్కువగా నిద్రపోవడానికి ఆసక్తి కనబరుస్తారు.

నాలుగు నెలల నుండి సంవత్సరం లోపు చిన్నారులు 13 నుంచి 14 గంటల సమయం నిద్రపోతారు. ఈ వయసులోనే చిన్న పిల్లలు రోజులో సగభాగం మెలకువతో ఉండి సగభాగం నిద్రపోతారు కనుక రాత్రి, పగలు వాతావరణ పరిస్థితులకు అలవాటు పడతారు. ఒకటి నుండి మూడు సంవత్సరాల లోపు చిన్నారులు రోజుకు 12 గంటల నుండి 13 గంటల పాటు నిద్రపోతారు. ఈ వయసు చిన్నారుల్లో మానసిక శారీరక పెరుగుదల అభివృద్ధి వేగంగా జరుగుతుంది.

మూడు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు 10 గంటల నుంచి 12 గంటల నిద్ర అవసరం. 7 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల లోపు పిల్లలకు 10 గంటల నిద్ర అవసరం. ఈ వయసు పిల్లలకు మధ్యాహ్నం గంటసేపు నిద్రపోవడం మంచిదంటున్నారు నిపుణులు. చిన్నపిల్లలు ప్రశాంతంగా నిద్ర పోవాలంటే పడకగది ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు దోమలు ఈగలు, బొద్దింకలు వంటివి లేకుండా చూసుకోవాలి.