`చంద్రయాన్ 2` పై నాసాకు బ్రాడ్ పిట్ ప్రశ్న
చంద్రయాన్-2 ప్రయోగంలో చివరి ఐదు నిమిషాల డ్రామా అనంతరం విక్రమ్ ల్యాండర్ ఆచూకి మిస్సయిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ అది ఎక్కడ ల్యాండ్ అయ్యిందో ఎవరికీ తెలీదు. కనీసం నాశనం అయినట్టు కూడా సిగ్నల్ లేదు. కమ్యూనికేషన్ తెగిపోవడం వల్లనే ఇస్రో అసలేం జరిగిందో చెప్పలేకపోతోంది. అయితే దీనిపై ఇప్పటికే అంతరిక్షంలో ఉన్న నాసా కనుగొనే ప్రయత్నం చేస్తోంది. అమెరికా నాసా వ్యోమగాములు సీరియస్ గానే విక్రమ్ సెర్చ్ లో ఉన్నారన్న సమాచారం ఉంది.
తాజాగా ఇదే విషయాన్ని హాలీవుడ్ సంచలనాల హీరో బ్రాడ్ పిట్ నాసా వ్యోమగామిని ప్రశ్నించారు. చంద్రునిపై గురుత్వాకర్షణ శక్తి ఎలా ఉంటుంది? అక్కడ వ్యోమగాముల జీవన విధానం ఎలా ఉంటుంది? అంటూ ప్రశ్నించిన బ్రాడ్ పిట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లో ఉన్న వ్యోమగామి నిక్ హేగ్ తో దాదాపు 20 నిమిషాలకు పైగా మాట్లాడారు. ఆయన నుంచి ఆసక్తికర సమాధానాలు వినిపించాయి. చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ చేరిందా లేదా? అన్న ప్రశ్నకు దురదృష్టవశాత్తూ ఇంకా కనుగొనలేకపోయామని ఆయన అనడం నిరాశపరిచింది. ప్రస్తుతం విక్రమ్ ల్యాండర్ ఏ స్థితిలో ఉంది అన్నదానికి సంబంధించిన ఫోటోల్ని తీసేందుకు నాసా కేంద్రం నుంచి ప్రయత్నాలు సాగుతున్నాయన్న సమాచారం ఉంది. మొత్తానికి బ్రాడ్ పిట్ ప్రస్థావనతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా దీనిపై చర్చ సాగుతోంది.