కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ నటించిన బిగిల్ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు 300 కోట్ల వసూళ్లతో ఆ చిత్రం సంచలనం సృష్టించింది. గత రెండేళ్లుగా ఇళయదళపతి ఇదే స్పీడ్ తో అపజయమే లేని హీరోగా దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఖైదీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో ఓ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఇది విజయ్ కి 64వ సినిమా కావడం విశేషం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఖైదీతో లోకేష్ కు కోలీవుడ్ సహా టాలీవుడ్ లోనూ మంచి పేరొచ్చింది. దీంతో ఈ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది.
గ్యాంగ్ స్టర్ నేపథ్యం ఉన్న చిత్రమిది. చక్కటి సందేశంతో ఉందన్న ప్రచారం సాగుతోంది. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో కొద్ది రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది. విజయ్ కి 64వ సినిమా కావడంతో విజయ్ 64 వర్కింగ్ టైటిల్ ని నిర్ణయించారు. దీనికి జేడీ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని జోరుగా ప్రచారం సాగింది. తాజాగా ఆ రెండింటిని కాదని మాస్టర్ అనే టైటిల్ ని ఖరారు చేసారు. మరి ఈ మాస్టర్ వెనుక గ్యాంగ్ స్టర్ మిస్టరీ ఏంటో తెలియాలంటే రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
గతంలో ఇదే టైటిల్ తో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈసినిమా బ్లాక్ బస్టర్. ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేట్ తీసినాడే మాస్టరు.. అంటూ సాగే పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఇందులో మెగాస్టార్ లెక్చరర్ పాత్రలో నటించారు. చెడు దారిలో వెళ్తోన్న విద్యార్ధులను సక్రమం చేయడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారన్నదే కథ. మరి ఈ కోలీవుడ్ మాస్టర్ వెనుక కథేంటో తెలియాలి. ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.