‘ఐబి 71’ కథ అలా పుట్టిందే : దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఇంటర్వ్యూ..

”తెలుగు చిత్ర ప్రరిశ్రమ కంటే పెద్ద పరిశ్రమ మరొకటి లేదనేది నా అభిప్రాయం” అంటున్నారు జాతీయ అవార్డు గ్రహీత రచయిత, దర్శకుడు సంకల్ప్ రెడ్డి. తదుపరి ఎలాంటి కథైనా, ఏ భాషలో సినిమా చేసినా హైదరాబాద్ కేంద్రంగానే చేస్తానంటున్నారాయన. అతడి తాజా చిత్రం ‘ఐబి 71’. బాలీవుడ్ యాక్షన్ స్టార్ విద్యుత్ జమ్వాల్ హీరోగా నటించి, నిర్మించిన ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, విశాల్ జెత్వా ముఖ్యపాత్రలు పోషించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతోపాటు, ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకుంటోంది. బాలీవుడ్ కేంద్రంగా హిందీలో వచ్చిన ఈ ‘ఐబి 71’ ఒకరకంగా సంకల్ప్ రెడ్డి గత చిత్రం ‘ఘాజీ’కి అనధికార ప్రీక్వెల్ అని చెప్పొచ్చు. ఈ చిత్రం 1971 ఇండో-పాక్ యుద్ధంలో జరిగిన వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొంది రూపొందింది. ఇంటిలిజెన్స్ బ్యూరో మీద వచ్చిన చిత్రాలు తక్కువే అని చెప్పాలి. ఈ ‘ఐబి 71’ (ఇంటిలిజెన్స్ బ్యూరో 71) చిత్రానికి సంబంధించిన విశేషాలను దర్శకుడు సంకల్ప్ రెడ్డి TELUGURAJYAM’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…

”క్లిష్టమైన వాతావరణంలో చిత్రీకరణ జరుపుకున్న ఈ ‘ఐబి 71’ సినిమా నా రెండేళ్ల కృషి. ‘ఘాజీ’నుంచి తీసుకున్నాం కాబట్టి ఎక్కడా మిస్ కాకుండా చేసిన మైండ్ గేమ్ ఇది. 1971 ఇండో-పాక్ యుద్ధంలో జరిగిన వాస్తవ సంఘటనకు తెరరూపం. ఇప్పటివరకు ఇంటిలిజెన్స్ బ్యూరో మీద వచ్చిన చిత్రాలు తక్కువే అయినప్పటికీ.. అలా వచ్చిన చిత్రాల్లో ఇదొక ప్రత్యేక చిత్రమని ఖచ్చితంగా చెప్పగలను. ఇటువంటి కథలు మామూలుగా ప్రజలవద్దకు చేరువకావు. ఎంతో లోతుగా పరిశీలిస్తే తప్ప మనకు తెలియవు. ఇది ముమ్మాటికీ నిజం. ఈ కథలు మన వద్దకు రావడానికి ఏళ్లు పడుతుంది. ఇలాంటి కథలు సైనిక చరిత్రకు సంబంధించినవి కాబట్టి చాలా సీక్రెట్ గానే బంధించబడతాయి. ఈ ‘ఐబి 71’ కూడా 50 ఇయర్స్ బ్యాక్ జరిగిన కథే. 1971 అంటే మోర్ దెన్ 50 ఇయర్స్ అన్నమాటే కదా! ఈ కథ కోసం ముంబయికి వెళ్లి ఎంతో లోతుగా పరిశోధన చేయాల్సి వచ్చింది. కథ అంత ఈజీగా సాధ్యం కాలేదు.

ఎంతో కసరత్తు చేయాల్సి వచ్చింది. అందుకోసం నేషనల్ లైబ్రరీలు, అలనాటి న్యూస్ పేపర్స్, ఆయా పత్రికల్లో వచ్చిన కథనాలు అన్నీ వివరంగా తెలుసుకొని, అందుకు అనుగుణంగా కథను తయారు చేసుకోవలసి వచ్చింది. ఈ ‘ఐబి 71’లో చూపించిన సంఘటనలన్నీ సహజమైనవే! కథలో చూపించినవన్నీ సమగ్రంగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ సంఘటనకు సంబంధించిన వ్యక్తులు అంటే ఆ ఆపరేషన్ కు సంబంధించిన వ్యక్తులను కలిసినప్పుడు వాళ్లు చెప్పిన విషయాలే ఈ కథకు ఎంతగానో దోహదం చేశాయి. ‘గంగా హైజాక్’ సంఘటనకు సంబంధించిన వ్యక్తులు అందరూ పాకిస్థాన్ వెళ్లిపోయారు. వాళ్ళందరినీ పాకిస్థాన్ బంధించింది. వారిని ఎలా రక్షించాలనేది కథలో ప్రధానాంశం. ఈ కథకు కొంత సినిమాటిక్ జతచేయక తప్పలేదు. ఇండియన్ ఇంటిలిజెన్స్ బ్యూరో ప్రతినిధులు పాకిస్థాన్ వెళ్లి అక్కడ ఓ స్పై ఆపరేషన్ ను విజయవంతంగా ఎగ్జిక్యూట్ చేశారు. ఈ మిషన్ సక్సెస్ ఫుల్ కావడం వల్ల వేలాది మంది భారతీయుల ప్రాణాలు రక్షించబడ్డాయి. ఈ మిషన్ తాలూకు విషయాలు తెలుసుకోవాలంటే ‘ఐబి 71’ సినిమా చూడాలి.

ఓ చారిత్రక ఘటనతో ఈ చిత్రంలో దేశభక్తి తాలూకు మూమెంట్స్ ఉంటాయి. ‘ఘాజీ’ ఇన్సిడెంట్ కు ముందు కశ్మీర్ లో జరిగిన ఓ ఘటన ఆధారంగా తీసిన చిత్రమిది. ‘ఘాజీ’, ‘అంతరిక్షం’, ఇప్పుడు ‘ఐబి 71’. ఈ కథల్లో భాగంగానే దేశభక్తి అంశం మిళితమై ఉంది. అంతే కానీ.. ప్రత్యేకంగా దేశభక్తి నేపథ్యాల్లో చేయాలని నేనీ సినిమా చేయలేదు. అలా కుదురుతోంది అంతే! బహుశా.. అంతర్లీనంగా నాలో ఉన్న దేశభక్తి కూడా ఓ కారణం కావొచ్చేమో! హిందీలో నాకు ‘ఐబి 71’ తొలి సినిమా. నేను చేసిన ‘ఘాజీ’ అండర్ వాటర్ బ్యాక్ డ్రాప్, రెండో సినిమా ‘అంతరిక్షం’ స్పేస్ బ్యాక్ డ్రాప్ లో ఉంటాయి. ఈ ‘ఐబి 71’లో బ్యాక్ డ్రాప్ ఆకాశం. అన్నీ దేశభక్తి ప్రధానమైన సినిమాలే చేస్తున్నారెందుకు? అని నన్ను చాలా మంది అడుగుతున్నారు. అలా అని ఏమీ లేదు. దేశభక్తి ప్రధానమైన సినిమాలే చేయాలన్న లక్ష్యం అంటూ ఏమీపెట్టుకోలేదు. అన్నీ అలా కుదురుతున్నాయంతే” అని చెప్పుకొచ్చారు.

ఈ మధ్య బాలీవుడ్ నుంచి అవకాశాలు అందుకుంటున్న తెలుగు దర్శకులు చాలామందే. ఆ జాబితాలో సంకల్ప్ రెడ్డి కూడా ఒకరు. ఈ ‘ఐబి 71’ అవకాశం కూడా తన గత చిత్రం ‘ఘాజీ’నే తెచ్చిపెట్టిందంటున్నారాయన. ఆదిత్య శాస్త్రి కథను అందించిన ఈ చిత్రాన్ని హీరో విద్యుత్ జమ్వాల్ తో పాటు, అబ్బాస్ సయ్యద్ నిర్మించగా.. ఆదిత్య శాస్త్రి, ఆదిత్య చౌక్సే మరియు శివచనాన నిర్మాతలుగా వ్యవహరించారు. స్టోరీ హౌస్ ఫిలిమ్స్ స్క్రీన్ ఫ్లే అందించిన ఈ చిత్రం యాక్షన్ సన్నివేశాలతో పాటు.. మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా తెరకెక్కింది. ప్రతీ ఫ్రేమ్ ని దర్శకుడు సంకల్ప్ రెడ్డి తీర్చిదిద్దిన వైనం ప్రేక్షకుల కళ్లకు కట్టింది. 2017లో వచ్చిన సంకల్ప్ రెడ్డి చిత్రం ‘ఘాజీ’ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలన వియజాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. రానా దగ్గుబాటి, కె.కె.మీనన్, అతుల్ కులకర్ణి నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుని దర్శకుడు సంకల్ప్ రెడ్డికి విశేష ప్రాచుర్యాన్ని కలిగించింది.

దర్శకుడిగా అతడికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. అలాంటి దర్శకుడి తాజా చిత్రం ‘ఐబి 71’ 1971 నాటి గంగా హైజాక్ ని ప్రేక్షకులు మెచ్చుకునేలా చూపించింది. ది ‘ఘాజీ’ ఎటాక్ కి ‘ఐబి 71’ ప్రీక్వెల్ అని ఎందుకు అంటున్నారంటే అంతటి ఆసక్తికరమైన కథ కాబట్టి. స్పై థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం దర్శకుడు సంకల్ప్ రెడ్డి ప్రతిభను మరోమారు రుజువు చేసిందని చెప్పొచ్చు. ఈ ‘ఐబి 71’ చిత్రం ప్రేక్షకుల అభిమానాన్ని పొందడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారాయన. ఈ ‘ఐబి 71’లో హీరో విద్యుత్ జమ్వాల్ తో పాటు నటించిన అనుపమ్ ఖేర్, విశాల్ జెత్వా ఉత్తమమైన నటనను కనబరిచారని, ఈ చిత్రం ద్వారా గొప్ప వ్యక్తిత్వం ఉన్న గొప్ప నటులతో కలిసి పనిచేసే అవకాశం కలగడం నాకు మరపురాని మజిలీగా నిలిచి పోతుందని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు సంకల్ప్ రెడ్డి. గంగా హైజాక్ 1971 నాటి కథ కావడంతో ఈ చిత్రం బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సంఘటనకు సంబంధించి భారతదేశం .. పాకిస్థాన్ పై వ్యూహాత్మక ప్రయోజనాన్ని ఎలా పొందిందో వివరించే సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఓ విధమైన ఆలోచనను రేకెత్తించాయి. ”ఈ ‘ఐబి 71’ ఆలోచనను విద్యుత్ తన వద్దకు తీసుకొచ్చినప్పుడు ఆశ్చర్యపోయాను.

మామూలుగా ఉండదనిపించింది. ‘గంగా హైజాక్’ సంఘటన గురించి హీరో విద్యుత్ నాకు చెప్పినప్పుడు.. ఇది చెప్పడానికి అద్భుతమైన కథ అనిపించింది. ఈ కథకు తెర రూపం ఇస్తే ఎలా ఉంటుందో ఊహించాను. అదే సమయంలో మేము పరిశోధనలో లోతుగా వెళ్ళినప్పుడు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాము. ఇది ‘ఘాజీ’ ఎటాక్ కి ప్రీక్వెల్ లాంటిదని గ్రహించాను. ఈ రెండు సినిమాలు 1970ల నాటి నేపథ్యంలో ఉంటాయి. భారతదేశ సైనిక చరిత్రను అన్వేషిస్తాయి కాబట్టి ఆసక్తికరం అనిపించింది. సహజంగా ఇలాంటి కథలు ప్రజలకు తెలియకుండా రహస్యంగా ఉంచుతారు. మనం ఈ రహస్య కథలు ప్రేక్షకులను కట్టిపడేసేలా, వారిని ఆలోచింపజేసేలా చేసేందుకు సరైన అవకాశం అని కూడా గ్రహించాను” అని చెప్పుకొచ్చారు సంకల్ప్ రెడ్డి.

1971లో ఇండో-పాక్ యుద్ధంలో పాకిస్థానీ జలాంతర్గామి పి.ఎన్.ఎస్, ఘాజీని ముంచి వేసిన భారతీయ జలాంతర్గామి ఐ.ఎన్.ఎస్ కరంజ్ కథను చెప్పిన ఘాజీ ఎటాక్ విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం. ఈ చిత్రం దాని ప్రామాణికత, సాంకేతిక నైపుణ్యం, గ్రిప్పింగ్ కథాంశంతో పలువురి ప్రశంసలు అందుకుంది.

”ఈ ‘ఐబి 71’ కోసం నేను పరిశోధన చేయడం పారంభించినప్పుడు ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాను. 1971 నాటి గంగా హైజాక్ గురించి చాలా మందికి తెలియదని గ్రహించాను. చరిత్ర నుండి వాస్తవాలను తెలుసుకొని వాటిని ఆసక్తికరంగా ప్రజలకు తెలియజేయడం ఒక సవాలు లాంటిది. ఆ సవాలును నేను స్వీకరించి ఈ కథను ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాను. ఇంతటి అద్భుతమైన కథకు తెరరూపం కల్పించడంలో ఎందరో కృషి ఉంది. ముఖ్యంగా మా టీమ్ పనితనం మెచ్చుకోతగ్గది. ప్రశంసనీయమైనది కూడా. వారందరికీ నేను కృతజ్ఞుడిని . ఈ ‘ఐబి 71’ కోసం పరిశోధన తీవ్రతరమైంది. మేము వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనుకున్నప్పుడు నిజమే చెప్పాలని నిర్ణయించుకున్నాం. ఈ చిత్రం ద్వారా మేము చెప్పాలనుకున్నది స్పష్టంగా ప్రేక్షకులకు అర్ధమయ్యేలా ఉండాలనుకున్నాం. ఇందుకోసం విమానాలు, దుస్తులు, ప్రదేశాలు అన్నింటినీ గమనిస్తూ .. అదే కళ్లకు కట్టాలనుకున్నాం. ఈ ఆలోచనను ప్రేక్షకులు మెచ్చేలా చేయాలంటే వాళ్లను ఆ యుగానికి తీసుకెళ్లేలా చేయాలనుకున్నాం. అలా చేయాలనుకున్న మా ప్రయత్నం ప్రేక్షకుల అభిమానాలతో నెరవేరిందనుకుంటున్నాం” అని దర్శకుడు సంకల్ప్ రెడ్డి స్పష్టంగా తన మనసును విప్పారు.

(సంకల్ప్ రెడ్డి గురించి : తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కు చెందిన సంకల్ప్ రెడ్డి 1984 అక్టోబర్ 20న జన్మించారు. ‘ఘాజీ’తో దర్శకుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి సంచలనానికి తెరతీశాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు, హిందీ, తమిళంలోనూ విడుదలై సంకల్ప్ రెడ్డి ప్రతిభను దశదిశలా చాటింది. ఆ తర్వాత 2018లో అంతరిక్షం అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సమయంలోనూ వార్తల్లో నిలిచిన వ్యక్తిగానే విశేష ప్రాచుర్యాన్ని పొందారు. 2006లో హైదరాబాద్ లోని సి.వి.ఆర్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసి అటు తర్వాత ఆస్ట్రేలియా, బ్రిస్పెన్ లోని గ్రిఫ్ఫిత్ విశ్వవిద్యాలయంలో ఎం.బి.ఏ చదువుకున్నారు. ఆ చదువును మధ్యలోనే వదిలేసి ఆస్ట్రేలియాలోనే ప్రసిద్ధిపొందిన గ్రిఫ్ఫిత్ ఫిలిం స్కూల్ లో సినిమా దర్శకత్వంలో ఎం.ఎఫ్.ఏ (2009)ను చదివారు. సినిమా రంగానికి రావడానికి ముందు ఓ నాలుగు లఘు చిత్రాలు తీసిన అనుభవం ఆయనది. సొంతగా కథ రాసుకొని ‘ఘాజీ’ (2017) తీశారు. ఆ తర్వాత అంతరిక్షం (2018), ఇప్పుడు ‘ఐబి 71’ (2023) సంకల్ప్ రెడ్డి నుంచి వచ్చిన చిత్రాలు).